ఎందుకమ్మా.. ఇలా చేశావు?
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:04 AM
Woman consumes herbicide with her two children ఇద్దరు పిల్లలకు ఓ తల్లి గడ్డి మందు తాగించింది. ఆపై తానూ తాగింది. అపస్మారకస్థితిలో ఉన్న ఆ ముగ్గురినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తల్లీ, 8 నెలల కుమారుడు మృతి చెందాడు. రెండేళ్ల కుమార్తె ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో సోమవారం ఈ హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది.
ఇద్దరు పిల్లలతో గడ్డిమందు తాగించి..
ఆపై తానూ తాగిన మహిళ
తల్లి, 8 నెలల కుమారుడు మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెండేళ్ల చిన్నారి
ఆ ఇంట్లో ఇక పసినవ్వులు వినిపించవు.
అమ్మ ఒడిలో హాయిగా నిద్రించాల్సిన
8 నెలల పసికందు శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.
మరో బిడ్డ ప్రాణం కోసం ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
ఇద్దరు పిల్లలను గుండెలకు హత్తుకుని బతకాల్సిన తల్లి..
వారికే విషం ఇచ్చి, తానూ తనువు చాలించింది.
ఏ కష్టం ఆమెను అంతటి నిర్ణయం వైపు నడిపించిందో?
తెల్లవారేసరికి ఆ ఇల్లు తీరని విషాదంలో మునిగిపోయింది.
ఎచ్చెర్ల, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఇద్దరు పిల్లలకు ఓ తల్లి గడ్డి మందు తాగించింది. ఆపై తానూ తాగింది. అపస్మారకస్థితిలో ఉన్న ఆ ముగ్గురినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తల్లీ, 8 నెలల కుమారుడు మృతి చెందాడు. రెండేళ్ల కుమార్తె ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో సోమవారం ఈ హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది.
హిరమండలం మండలం కొండరాగోలు గ్రామానికి చెందిన మీనా(25)కు మూడేళ్ల కిందట చిలకపాలెం గ్రామానికి చెందిన లారీడ్రైవర్ జగదీష్‌తో వివాహమైంది. ఈ దంపతులకు రెండేళ్ల కుమార్తె గాయత్రి, ఎనిమిది నెలల కుమారుడు కులదీప్ ఉన్నారు. చిలకపాలెంలో జగదీష్ నివాసం ఉంటున్న ఇంటిపై భాగంలో ఆయన తల్లిదండ్రులు తవుడమ్మ, పైడమ్మ, సోదరుడు సురేష్ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వీరంతా సోమవారం ఉదయం చిలకపాలెంలోని ఓ బంధువు 11 రోజుల దినకర్మకు వెళ్లివచ్చారు. సోమవారం రాత్రి లారీ పనిపై జగదీష్ బయటకు వెళ్లాడు. కాగా.. 20 రోజుల నుంచి మీనాకు పీడ కలలు వస్తుండడంతో నిద్ర లేమితో బాధపడుతోంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన మీనా తన తల్లి అమ్మాయమ్మకు ఈ విషయాన్ని తెలియజేసింది. కుమార్తె భయం పోయేందుకు తల్లి ఏదో తాయత్తు కట్టించింది. ఇంతలోనే మీనా ఇంట్లో ఉన్న గడ్డి మందును మంగళవారం ఉదయం ఇద్దరు పిల్లలకు పాలలో కలిపి తాగించి, ఆ తర్వాత తానూ తాగింది. మీనా బాత్‌రూమ్‌లో వాంతులు చేసుకుంటుండగా, తోటికోడలు (సురేష్ భార్య) వచ్చి చూసింది. మందు వాసన రావడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా పిల్లలు మంచంపై స్పృహ లేకుండా పడి ఉన్నారు. వెంటనే ఆ ముగ్గురినీ చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. మీనా తల్లి అమ్మాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. వారిది ఉమ్మడి కుటుంబమని, ఎలాంటి తగాదాలు, మనస్పర్థలు లేవని మీనా తల్లి అమ్మాయమ్మ ద్వారా తెలిసిందన్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాలకు బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు తెలిపారు.