Share News

ఈ దందాను అడ్డుకునేదెవరు?

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:41 PM

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో పని చేస్తున్న కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నిర్వాకంతో దేవస్థానం ప్రతిష్ఠ దిగజారుతోంది.

 ఈ దందాను అడ్డుకునేదెవరు?

- ఆదిత్యాలయంలో ఆగని వసూళ్లు

- అధికారులను ఖాతరు చేయని కొందరు సిబ్బంది

- అధికార పార్టీ నాయకుని పేరు చెప్పి అక్రమాలు

- మధ్యాహ్నం అయితే లడ్డూ ప్రసాదం కరువు

అరసవల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో పని చేస్తున్న కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నిర్వాకంతో దేవస్థానం ప్రతిష్ఠ దిగజారుతోంది. ఆలయ అధికారులు ఎంత చెబుతున్నా ఈ సిబ్బంది చేతివాటం మాత్రం ఆగడం లేదు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి పేరును అడ్డం పెట్టుకుని వసూళ్ల దందాను కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లుగా నియామకం కాని ట్రస్టు బోర్డు కొద్ది రోజుల కిందటే ఏర్పాటైంది. అయితే, గతంలో ఆలయంలో అనధికారికంగా సంచరిస్తూ, వీఐపీ భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు వారి వెంటే ఉంటూ మామూళ్లు తీసుకునే ఓ వ్యక్తే నేడు ట్రస్టు బోర్డు సభ్యుడిగా నియామకమయ్యాడు. కొద్ది రోజుల కిందట ఈ వ్యక్తి దూరప్రాంతం నుంచి వచ్చిన కొందరు భక్తులతో ప్రత్యేక దర్శనం చేయిస్తానని చెప్పి వారి నుంచి సొమ్ములు వసూలు చేసినట్లు ఆలయ సిబ్బందే బాహటంగా విమర్శిస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీగా విధులు నిర్వర్తించే ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆదివారాల నాడు దర్శనాల పేరిట భక్తుల నుంచి డబ్బులు దండుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ప్రసాదాలకు సంబంధించి మధ్యాహ్నం లడ్డూ దొరకడం లేదని, పులిహోర మాత్రమే లభిస్తోందని, భక్తులు వాపోతున్నారు. ఉచిత అన్నదాన కార్యక్రమంలో స్థానిక అరసవల్లికి చెందిన వారే ప్రతిరోజూ సుమారు 60 మంది వరకు భోజనాలు చేస్తున్నారని, పనిచేసే సిబ్బంది తమ ఇళ్లకు పార్సిళ్లు తీసుకువెళుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ పరిస్థితులను చక్కదిద్దాలని, మరింత మెరుగైన సేవలందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:41 PM