మా గోడు వినేదెవరు?
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:06 AM
Tribals for 72 years... now they say no వారంతా జిల్లాలోని కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, జలుమూరు, టెక్కలి మండలాల్లోని సుమారు 5వేల మంది గిరిజనులు. వీరంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే. 1933 నుంచి 2005 సంవత్సరం వరకు అంటే.. 72 ఏళ్ల పాటు ప్రభుత్వం వారిని ‘ఎస్టీ ఏనేటి కోండ్స్’ గా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది. కానీ ఆ తర్వాత నుంచీ గత 20 ఏళ్లుగా వారికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ నిలిపేసింది.
72ఏళ్లుగా గిరిజనులం... ఇప్పుడు కాదంటున్నారు
కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు
మా పిల్లలు అన్యాయమై పోతున్నారు
జడ్పీ గ్రీవెన్స్ వద్ద ఎస్టీ ఏనేటి కోండ్స్ ప్రజల ఆవేదన
న్యాయం చేయాలని వినతి
శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): వారంతా జిల్లాలోని కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, జలుమూరు, టెక్కలి మండలాల్లోని సుమారు 5వేల మంది గిరిజనులు. వీరంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే. 1933 నుంచి 2005 సంవత్సరం వరకు అంటే.. 72 ఏళ్ల పాటు ప్రభుత్వం వారిని ‘ఎస్టీ ఏనేటి కోండ్స్’ గా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది. కానీ ఆ తర్వాత నుంచీ గత 20 ఏళ్లుగా వారికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ నిలిపేసింది. దీంతో వారు ప్రభుత్వ పథకాలకు, ఉన్నత చదువులకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అర్హతను కోల్పోయారు. దీంతో తమ గోడును పట్టించుకునేవారు కరువయ్యారంటూ.. ఆయా గ్రామాల గిరిజనులు సోమవారం శ్రీకాకుళంలో జడ్పీ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నిర్వహించిన ‘మీ-కోసం’(గ్రీవెన్స్) కార్యక్రమంలో అధికారులకు గోడు వినిపించి.. తమకు న్యాయం చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఇదిలా ఉంగా.. గతంలో వీరికి ఎస్టీ ఏనేటి కోండ్స్ కుల ధ్రువపత్రాల ద్వారానే పాఠశాలల్లో విద్య, వాహనాలు, రోడ్లు, మొక్కలు, బావులు, ఎంప్లాయిమెంట్ కార్డులు మంజూరయ్యేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం కూడా అన్ని గ్రామాల్లో వీరు ‘‘ఎస్టీ ఏనేటి కోండ్స్’’గా గుర్తించబడే ఉన్నారు. పాస్ పుస్తకాలపై ఎస్టీగా ధ్రువీకరించి ఇప్పుడు మమ్మల్ని ఓసీలో పెడుతున్నారు. మరి ఓసీలో సబ్ కేటగిరి ఏంటని అడిగితే అధికారుల వద్ద సమాధానం లేదు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వారు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వకపోగా, ఏ కులానికి సంబంధించిన వారమో కూడా తెలియజేయకుండా, కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లేదు. మేమంతా పేదలం. ఎలా బతకాలి...? మా గోడు వినేవారెవరు. దయచేసి న్యాయం చేసి ఆదుకోవాలని ఆయా గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సొమ్మసిల్లిన విద్యార్థిని
20 ఏళ్ల నుంచి కుల ధ్రువపత్రాలు జారీ చేయడంతో తమ అవస్థలను అధికారులకు చెప్పుకునేందుకు ‘ఎస్టీ ఏనేటి కోండ్స్’కు చెందిన వందలాది మంది మహిళలు, విద్యార్థులతో సహా గ్రీవెన్స్ వద్దకు చేరుకున్నారు. తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఇందులో ఓ చిన్నారి ఎండ వేడికి సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆ చిన్నారికి సపర్యలు చేయడంతో కొద్దిసేపటి తర్వాత కోలుకుంది.