Share News

పరిషత్‌పోరులో విజేతలెవరో?

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:46 PM

జిల్లాలో జరిగిన పరిషత్‌ పోరులో ప్రజాతీర్పు మరికొద్ది గంటల్లో వెల్లడికానుంది.

పరిషత్‌పోరులో విజేతలెవరో?
టెక్కలి మండలం ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం

- నేడే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు

- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

- 696 టేబుళ్లు, 4114 మంది సిబ్బంది కేటాయింపు

- స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత

- అభ్యర్థుల్లో టెన్షన్‌.. తేలనున్న భవితవ్యం

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరిగిన పరిషత్‌ పోరులో ప్రజాతీర్పు మరికొద్ది గంటల్లో వెల్లడికానుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కౌంటింగ్‌ కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, ఫలితాలు వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయిందని, ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, అనంతరం బ్యాలెట్‌ బాక్సులను లెక్కిస్తారు. అభ్యర్థులు, ఏజెంట్లు గుర్తింపు కార్డులతోనే హాజరు కావాలని, విజయోత్సవ ర్యాలీలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలియజేసారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట మూడంచెల భద్రత, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా, కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో వివిధ పార్టీ అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్‌ నెలకొంది. విజయం ఎవరిని వరిస్తుందో.. ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్య అనుచరులతో సుదీర్ఘంగా చర్చించుకుంటూ ఫలితాలపై బేరీజు వేసుకుంటున్నారు.

నాలుగు చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలు..

జిల్లాలోని 30 మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను నాలుగు కేంద్రాల్లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజనీరింగ్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి.సిగడాం, శ్రీకాకుళం, గార, నరసన్నపేట, పోలాకి, సారవకోట, జలుమూరు మండలాల ఓట్లను, టెక్కలి ఐతం ఇంజనీరింగ్‌ కళాశాలలో పాతపట్నం, మెళియా పుట్టి, కొత్తూరు, హిరమండలం, లక్ష్మీనర్సుపేట, టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల ఓట్లను, పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోంపేట, కవిటి మండలాలు, పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో పలాస, మందస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, కంచిలి మండలాల ఓట్లను లెక్కించనున్నారు.

696 టేబుళ్లు.. 4,114 మంది సిబ్బంది..

30 మండలాల ఓట్ల లెక్కింపు నిమిత్తం మొత్తం 696 టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతీ టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఒక సహాయకుడు, ముగ్గురు కౌంటింగ్‌ అసిస్టెంట్లతో కలిపి ఐదుగురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. 696 మంది సూపర్‌వైజర్లు, 696 మంది సహాయకులు, 2,088 మంది అసిస్టెంట్లు కలిపి మొత్తం 3,480 మంది బాధ్యతలు స్వీకరిస్తారు. అత్యవసర విధులకు 126 మంది సూపర్‌వైజర్లు, 138 మంది సహాయకులు, 370 మంది అసిస్టెంట్లతో కలిపి 634 మందిని రిజర్వులో ఉంచారు. మొత్తంగా 4,114 మంది ఉద్యోగులు కౌంటింగ్‌ విధుల్లో పాల్గొంటున్నారు. రణస్థలంకు సంబంధించి అత్యధికంగా 38 టేబుళ్లు (220 మంది సిబ్బంది), గారలో 34 టేబుళ్లు(198 మంది సిబ్బంది), లక్ష్మీనర్సుపేటకు సంబంధించి అత్యల్పంగా 12 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

తుది ఓటింగ్‌ గణాంకాలు..

జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 30 మండలాల పరిధిలోని 2,003 పోలింగ్‌ కేంద్రాల్లో 16,20,965 మంది ఓటర్లు ఉండగా, 10,59,426 మంది(65.36శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులు పురుషులు 4,97,905 కాగా, మహిళలు 5,62,756 మంది ఇతరులు ఇద్దరు ఓటింగ్‌లో పాల్గొన్నారు. రణస్థలంలో అత్యధికంగా 81.06శాతం, లావేరులో 77.79శాతం ఓటింగ్‌ నమోదు కాగా, పాతపట్నంలో అత్యల్పంగా 51శాతం మాత్రమే నమోదయింది.

- 523 మంది ఎంపీటీసీ స్థానాల్లో 1940 కేంద్రాల్లో మొత్తం 15,69,362 మంది ఓటర్లకు గాను 10,28,016 మంది (65.51శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 4,82,625 మంది, మహిళలు 5,45,389 మంది ఉన్నారు. రణస్థలం మండలం 81.45 శాతం ఓటింగ్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది.

================

నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

- మున్సిపల్‌ ఫలితాల మాదిరిగానే ఉంటాయని అంచనా

పలాస, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్య ర్థుల భవితవ్యం శనివారం తేలనుంది. జిల్లాలో 30 జడ్పీటీసీ స్థానాల కు 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక 542 ఎంపీటీసీ స్థానాలకుగాను... 19 ఏకగ్రీవమయ్యాయి. 523 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక లు జరిగాయి. మొత్తం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 1,222 మంది బరిలో నిలిచారు. మొత్తంగా పరిషత్‌ పోరులో నిలిచిన 1,317 మంది భవితవ్యం శనివారం తేలనుంది. పలాస డివిజన్‌లో మొత్తం ఏడు మండలాలకు చెందిన 135 ప్రాదేశికాలు, ఏడు జడ్పీటీసీ స్థానాల ఫలితాలు తేలనున్నాయి. ఇందులో మూడు ఏకగ్రీవాలు కాగా మిగి లిన స్థానాలకు పోటీ జరిగింది. పలాసలో 11 ప్రాదేశిక స్థానాలు, వజ్రపుకొత్తూరు 19, మందస 24, సోంపేట 23, ఇచ్ఛాపురం 15, కంచిలి 19, కవిటిలో 22 ప్రాదేశిక స్థానాలు ఉన్నాయి. పురపోరులో పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో అవే ఫలితాలు పరిషత్‌ ఎన్నికల్లో వస్తాయని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. డివిజన్‌లో ఉన్న ఏడు మండలాలు, జడ్పీటీసీ స్థానాలు గెలవడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తుంది.

Updated Date - Nov 06 , 2026 | 11:46 PM