‘పుర’ పోరులో నిలిచేదెవరో?
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:07 AM
ఆమదాలవలస మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా కౌన్సిలర్ అభ్యర్థులుగా 148 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
- నేడే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు
- రెబల్స్‌ను బుజ్జగిస్తున్న ప్రధాన పార్టీలు
- స్వతంత్రులను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం
ఆమదాలవలస, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా కౌన్సిలర్ అభ్యర్థులుగా 148 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన అనుచరులు పోటాపోటీగా నామినేషన్‌లు వేశారు. అన్ని కూడా సక్రమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం ఆఖరి గడువు కావడంతో ఎవరు తప్పుకుంటారు.. ఎవరు బరిలో ఉంటారు అన్నది తేలనుంది. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నుంచి పోటీలో నిల్చొన్న వారికి ఆయా పార్టీలు బీఫారాలు అందించాలి. దీనికోసం సరైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన బాధ్యత ప్రధాన పార్టీల నేతలపై ఉంది. అయితే, ఎవరిని పోటీలో ఉంచాలి, ఎవరిని తప్పించాలి అనే విషయం తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. 28 వార్డులకు సంబంధించి టీడీపీ నుంచి 62, జనసేన 13, బీజేపీ నుంచి ఐదు మొత్తం 80 నామినేషన్లు కూటమి తరపున దాఖలయ్యాయి. వైసీపీ నుంచి 60 మంది నామినేషన్లు వేశారు. వివిధ వార్డుల నుంచి 8 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. అత్యధిక వార్డులను కైవసం చేసుకోవాలని కూటమి, వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా వార్డుల వారీగా కులం, కుటుంబం, ప్రజల మద్దతు ఉన్న వ్యక్తులను కౌన్సిలర్ అభ్యర్థిగా ఎంపిక చేసి రెబల్స్ లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇరు పార్టీలకు చెందిన రెబల్స్ అభ్యర్థులతో మాట్లాడి వారిని బుజ్జగిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకొని పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులను కూడా నిలువరించి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్, జనసేన ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్, బీజేపీ ఇన్‌చార్జి పేడాడ సూరప్పలనాయుడు కలిసి చర్చలు జరుపుతున్నారు. కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ కూడా తమ పార్టీ రెబల్స్‌తో చర్చలు జరిపి ఒక్కరే పోటీలో ఉండేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు