Share News

ఎవరొస్తారో?

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:19 AM

జిల్లా వైద్యారోగ్యశాఖలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి.

ఎవరొస్తారో?
జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం

-జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పోస్టు ఖాళీ

- అనిత బదిలీ తరువాత ఎవరూ చేరని వైనం

- నరేష్‌కుమార్‌ను రిలీవ్‌ చేయని విశాఖ కమిషనర్‌

-భాస్కరరావు వస్తామంటున్నా వద్దంటున్నారు

అరసవల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్యారోగ్యశాఖలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతవరకు డీఎంహెచ్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలతో పనిచేసిన డాక్టర్‌ అనిత కాకినాడకు బదిలీపై వెళ్లిపోయారు. ఈ నెల 14న ఆమె రిలీవ్‌ అయి మరుసటి రోజే అక్కడ విధుల్లో చేరారు. ఆమె స్థానంలో విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న డాక్టర్‌ ఈవీ నరేష్‌కుమార్‌ శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా నియమితులయ్యారు. అయితే నరేష్‌కుమార్‌ సేవలు అవసరమని చెప్పి, విశాఖ మునిసిపల్‌ కమిషనర్‌ ఆయనను రిలీవ్‌ చేయలేదు. నరేష్‌కుమార్‌ స్థానంలో పార్వతీపురం మన్యం డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు నియమితులయ్యారు. అయితే ఆయన విశాఖపట్నంలో రిపోర్టు చేసేందుకు వెళితే అక్కడ పనిచేస్తున్న నరేష్‌కుమార్‌ రిలీవ్‌ కాకపోవడంతో భాస్కరరావు వెనుతిరిగారు. అప్పటికే పార్వతీపురం డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ విజయలక్ష్మి విధుల్లో చేరిపోయారు. భాస్కరరావు శ్రీకాకుళంలో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నా సరే ఆయన అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద శ్రీకాకుళం డీఎంహెచ్‌వో పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి తక్షణమే జిల్లాకు వైద్యారోగ్యశాఖ అధికారిని నియమించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:19 AM