Share News

నగర పీఠం ఎవరిదో..?

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:32 AM

Counting of votes for Mayor and Corporator today పదహారేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈనెల 26న సజావుగా ముగిసిన పోలింగ్‌లో నగర ఓటర్లు ఇచ్చిన తీర్పు బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తమైంది. సోమవారం ఎచ్చెర్లలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుండటంతో సిక్కోలు నగర పీఠం ఎవరిని వరిస్తుందనేది చర్చనీయాంశమవుతోంది.

నగర పీఠం ఎవరిదో..?

మరికొన్ని గంటల్లో తేలనున్న మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థుల భవితవ్యం

ఆమదాలవలస మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల ఫలితాలు కూడా..

గెలుపోటముల్లో మహిళా ఓటర్లే కీలకం

ప్రధాన పార్టీల్లో క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

నేడు ఓట్ల లెక్కింపు

శ్రీకాకుళం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పదహారేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈనెల 26న సజావుగా ముగిసిన పోలింగ్‌లో నగర ఓటర్లు ఇచ్చిన తీర్పు బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తమైంది. సోమవారం ఎచ్చెర్లలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుండటంతో సిక్కోలు నగర పీఠం ఎవరిని వరిస్తుందనేది చర్చనీయాంశమవుతోంది. ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన మేయర్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా దానేటి రాధారాణి(జనసేన), వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మేయర్‌ పదవికి వీరిద్దరితోపాటు కాంగ్రెస్‌ నుంచి మంతి లక్ష్మి, ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా చల్లా గ్రీష్మ సంజన, బలివాడ స్వాతి పోటీ చేశారు. అలాగే 60 డివిజన్లకుగాను 168 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ నుంచి 52 మంది, వైసీపీ నుంచి 59, జనసేన 6, బీజేపీ 3, కాంగ్రెస్‌ 5, సీపీఎం 2, ఇండిపెండెంట్‌లు 41 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటీ చేశారు.

విజేతను తేల్చేది మహిళా ఓటర్లే!

శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని 60 డివిజన్ల పరిధిలో మొత్తం 1,57,545 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 86,155 మంది (54.69 శాతం) మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో పురుషుల (41,894 మంది - 48.63 శాతం) కంటే మహిళలే (44,261 మంది - 51.37 శాతం) 2,367 మంది (2.74 శాతం) అధికంగా ఓటేశారు. మేయర్‌ బరిలో ఉన్న అభ్యర్థులంతా మహిళలే కావడం, ఇటు ఓటింగ్‌లోనూ అతివలదే పైచేయి కావడంతో వారి తీర్పే గెలుపు గుర్రాలను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రధాన పార్టీల్లో ‘క్రాస్‌ ఓటింగ్‌’ గుబులు..

మేయర్‌ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగడంతో ప్రతి ఓటరు కార్పొరేటర్‌కు ఒకటి, మేయర్‌కు ఒకటి చొప్పున రెండు ఓట్లు వేయాల్సి వచ్చింది. అభ్యర్థులు పోటాపోటీగా చేసిన నగదు పంపిణీ ఓటింగ్‌పై ప్రభావం చూపిందని, డబ్బులు తీసుకున్న ఓటర్లలో చాలామంది కార్పొరేటర్‌గా ఒక పార్టీకి, మేయర్‌గా మరో పార్టీకి ఓటు వేసి ఉంటారనే ప్రచారం జోరుగా సాగింది. దీనికితోడు సామాజికవర్గాల సమీకరణాలు క్రాస్‌ ఓటింగ్‌లో కీలకంగా మారనున్నాయి. కొన్ని డివిజన్లలో తమ కులానికి చెందిన మేయర్‌ అభ్యర్థికే ఓటర్లు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. ఇతర సామాజిక వర్గాలవారు.. మేయర్‌ సీటు ఆశించి.. దక్కనివారు.. ఇతర అసంతృప్త నాయకులు, మైనారిటీలు సైతం క్రాస్‌ ఓటింగ్‌కు మొగ్గు చూపారని చర్చ నడిచింది. ఇదంతా ఉత్త ప్రచారమేనని.. కూటమి గెలుపు తథ్యమని.. జనసేన అభ్యర్థి విజయం ఖాయమంటూ మరోవైపు ప్రచారం జోరందుకుంది. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఆమదాలవలస మునిసిపాలిటీలో..

ఆమదాలవలస మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌ స్థానంతోపాటు 28 వార్డుల్లో కౌన్సిలర్‌ స్థానాలు ఉన్నాయి. ఈ మునిసిపాలిటీలో 33,067 మంది ఓటర్లు ఉండగా 24,867 మంది(75.20 శాతం) ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1191 మంది, మహిళలు 12951 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రేసులో టీడీపీ తరపున ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సతీమణి.. కూన ప్రమీల, వైసీపీ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతా కుమారి, కాంగ్రెస్‌ నుంచి లఖినేని కల్యాణి బరిలో నిలిచారు. 28 వార్డులకుగానూ కౌన్సిలర్లుగా 65 మంది పోటీ పడ్డారు. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడించనున్నారు.

నేడు ఓట్ల లెక్కింపు

శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శివానీ కళాశాలలో ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు పటిష్టమైన భద్రత, ప్రవేశ నియంత్రణ ఏర్పాట్లు చేశామని శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమిషనర్‌ జి.శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లు అధికారులు, సిబ్బంది ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

Updated Date - Nov 30 , 2026 | 12:32 AM