విభజన ఎప్పుడో!
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:18 AM
Further delay in teacher allocation... జిల్లాల వారీగా ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ జాప్యమవుతోంది. దీంతో ఉపాధ్యాయుల్లో గుబులు రేగుతోంది. విభజన ఉంటుందా? లేదా?.. ఎప్పుడు.. ఎలా చేస్తారు.. కేడర్ సీనియార్టీనా, వయసువారీగా పరిగణలోకి తీసుకుంటారా..? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపు మరింత ఆలస్యం..
రోజుకొక నిబంధనలతో గందరగోళం
పదోన్నతులకు ఫ్రీజింగ్ ఎత్తివేత
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాల వారీగా ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ జాప్యమవుతోంది. దీంతో ఉపాధ్యాయుల్లో గుబులు రేగుతోంది. విభజన ఉంటుందా? లేదా?.. ఎప్పుడు.. ఎలా చేస్తారు.. కేడర్ సీనియార్టీనా, వయసువారీగా పరిగణలోకి తీసుకుంటారా..? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా పునర్విభజన జరిగినా వాటికి సరైన యంత్రాంగం లేకపోవడంపై పాలనాపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. చట్టప్రకారం మే నెలలో జరగాల్సిన ఉపాధ్యాయ బదిలీలను ఈసారి రద్దు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను దామాషా మేరకు విభజించి జిల్లాలకు కేటాయిస్తారు. ఈ మేరకు ఉపాధ్యాయుల విభజనకు ప్రక్రియకు మొదలుపెట్టారు. జూన్‌లో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచీ ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ అదిగో.. ఇదిగో అంటూనే విద్యాశాఖ అధికారులు చెబుతుండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో సందిగ్ధం నెలకొంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో, పాలకొండ నియోజకవర్గాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల విభజన ప్రక్రియలో భాగంగా జిల్లా పరిధిలో టీచర్లను ఈ మూడు జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు. జిల్లాకు 80.23 శాతం, విజయనగరం జిల్లాకు 9.81 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాకు 8.96 శాతం కేటాయించారు. ఈ మేరకు విభజన అనంతరం జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల మంజూరు ప్రక్రియ చేపట్టనున్నారు. పోస్టుల వారీ పరిశీలిస్తే.. హిందీ -591, తెలుగు -594, ఇంగ్లీషు - 645, గణితం - 600, భౌతికశాస్త్రం - 444, జీవశాస్త్రం -455, సాంఘీకశాస్త్రం -536, పీడీ -343, ఎస్జీటీ తెలుగు మీడియం- 4023, ఓరియా మీడియం -228 పోస్టులు కేటాయించారు. వీటిని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
విభిన్న వాదనలు
ఉపాధ్యాయుల విభజన విషయంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల ప్రకారం సబ్జెక్టుల వారీగా కేడర్ మేరకు సీనియార్టీ జాబితాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లాలో 13వేలమంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల దామాషా ప్రకారం విభజించనున్నారు. విభజన ఆలస్యం కావడంతో నెలవారీగా ఉద్యోగ విరమణ పొందిన టీచర్లను ఈ కేడర్ సీనియార్టీ జాబితా నుంచి తొలగిస్తూ వస్తున్నారు. అంగీకారం తీసుకొని సీనియార్టీ మేరకు టీచర్లను కోరుకున్న జిల్లాలకు అవకాశం కల్పిస్తారని మొదటి నుంచి చెబుతున్నారు. ఏ జిల్లాకైనా దామాషా కన్నా తక్కువ వస్తే ఆ కేడర్‌లో జూనియర్లకు పంపిస్తారని అంటున్నారు. కాగా విభజన ప్రక్రియ ఆలస్యం, వివిధ సమస్యలపై పలువురు టీచర్లు కోర్టుకు వెళ్లడంతో విభజనలో మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. సబ్జెక్ట్ కేడర్‌తోపాటు వయసు ఆధారంగా సర్దుబాబు చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. 35 ఏళ్ల వయసులోపు వారిని ఒక విభాగం, 35 నుంచి 50 ఏళ్ల రెండో విభాగం, 50 నుంచి 62 ఏళ్ల వరకు మరో విభాగంగా విభజిస్తారు. వీరిలో దివ్యాంగుల ఉపాధ్యాయులు, స్పెషల్ కేటగిరీ చెందిన ఉపాధ్యాయులను వేర్వురుగా విభజిస్తారని వాదన కూడా ఉంది. ఆ మేరకు దామాషా ప్రకారం ఆయా కేడర్‌లో వయసు ప్రాధాన్యం మేరకు విభజిస్తే సీనియర్లు సైతం పార్వతీపురం జిల్లాకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపఽథ్యంలో ఉపాధ్యాయ వర్గాల్లో టెన్షన్ కలుగుతోంది.
పదోన్నతులు తీసుకుంటారా?
విభజన నేపథ్యంలో బదిలీల.. ఉద్యోగోన్నతులు ఆగిపోయాయి. జీవోలు ఇచ్చేవరకు ఉద్యోగోన్నతులు ఇచ్చుకోవచ్చని ప్రభుత్వం ఫ్రీజింగ్‌ను సవరించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు అవకాశం ఏర్పడింది. హెచ్‌ఎం పోస్టులకు స్కూల్ అసిస్టెంట్‌లు, ఎస్‌ఏ పోస్టులకు ఎస్‌జీటీలను పదోన్నతిపై తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగోన్నతులు తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. సాధారణంగా అనుకూలమైన ప్లేస్‌లు లేకపోతేనే పదోన్నతులు వద్దని తిరస్కరిస్తారు. జిల్లా విభజన నేపథ్యంలో జూనియర్లగా పరిగణిస్తారనే ఆందోళన నెలకొంది. దీంతో పదోన్నతులు తీసుకోవడానికి కొందరు ఉపాధ్యాయులు జంకుతున్నారని తెలుస్తోంది. ఈ విషయమై డీఈవో రవిబాబు వద్ద ప్రస్తావించగా.. ‘ఉపాధ్యాయులు విభజన విషయానికి సంబంధించిన ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాలను వివిధ కేడర్ల వారీగా సిద్ధం చేశామ’ని తెలిపారు.