విజేతలు ఎవరు?
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:14 AM
Vote counting in municipalities today జిల్లాలోని పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసి పాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బ్యాలెట్‌బాక్సుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
నేడు ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు
మూడంచెల భద్రత నడుమ ఏర్పాట్లు
పలాస/ ఇచ్ఛాపురం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసి పాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బ్యాలెట్‌బాక్సుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చైర్‌పర్సన్లు, వార్డుల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. విజేతలు ఎవరనేదానిపై జిల్లావ్యాప్తంగా చర్చ సాగుతోంది.
ఇచ్ఛాపురంలోని 28 వార్డుల్లో.. 24వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థికి ఏకగ్రీవమైంది. చైర్‌పర్సన్ స్థానంతోపాటు మిగిలిన వార్డుల్లో కౌన్సిలర్ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా 65.55 శాతం పోలింగ్ నమోదైంది. పురుషోత్తపురం ఏపీ మోడల్ స్కూల్ వద్ద స్ర్టాంగ్‌రూంలో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచారు. మంగళవారం తొలుత ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్ల లెక్కింపు చేపడతారు. లెక్కింపు కోసం 3 గదులను కేటాయించారు. ఒక్కోవార్డుకు రెండు ప్రత్యేక టేబుళ్లపై వార్డుల కౌన్సిలర్, చైర్‌పర్సన్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. వార్డు సభ్యులకు 14, చైర్‌పర్సన్‌కు 14, పోస్టల్ బ్యాలెట్లకు 2, ముగ్గురు పరిశీలకులకు 3 చొప్పున మొత్తం 33 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ పూర్తికాగానే మైక్ ద్వారా విజేతల వివరాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. మధ్యాహ్నం 1 గంటలోగా ఫలితం వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు ఎన్నికల అధికారి, ఇచ్ఛాపురం మునిసిపల్ కమిషనర్ నల్లి రమేష్ తెలిపారు. ‘లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు సిద్ధం చేశాం. కేంద్రాల వెలుపల 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎలాంటి విఘాతం కలుగకుండా సాయుధ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామ’ని కమిషనర్ రమేష్ తెలిపారు.
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో మొత్తం 36 వార్డులకుగానూ 70.15 శాతం పోలింగ్ నమోదైంది. పలాసలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులు తెలిపారు. ‘రెండు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా 18 టేబుల్స్ సిద్ధం చేశాం. 1వ వార్డునుంచి 18 వార్డులు మొదటి రౌండ్‌లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. 19 నుంచి 36 వార్డు వరకూ రెండో రౌండ్‌లో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తాం. ఒక్కో టేబుల్‌కు ఐదు మంది సిబ్బంది చొప్పున నియమించామ’ని కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు.
వర్షంలో తడిసిన టెంట్లు
పలాసలో సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో.. ఓట్ల లెక్కింపు ప్రాంగణమంతా బురదమయమైంది. టెంట్లు కింద పడిపోయాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాల ప్రాంగణం పెద్దది కావడం, అదనంగా తరగతి గదులు ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఫలితాలపై ఉత్కంఠ
పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో మంగళవారం ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో విజయావకాశాలపై ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు సర్వత్రా ఉత్కఠం నెలకొంది. గెలుపు, ఓటములు, మెజార్టీపై ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి పలాసలో టీడీపీ నాయకులు.. ఏజెంట్లకు సోమవారం శిక్షణ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు, అభ్యంతరాలు, చెల్లని ఓట్ల వ్యవహారం తదితర వాటిపై పలు సూచనలు చేశారు.
పటిష్ఠ భద్రత : ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో మంగళవారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘రెండు చోట్ల లెక్కింపు కేంద్రాలు, స్ర్టాంగ్‌రూమ్‌లు, పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతా విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలతోపాటు సుమారు 500 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీకి సంబంధించి మోడల్ స్కూల్‌లో, పలాస మున్సిపాలిటీకి సంబంధించి జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఆయా కేంద్రాల వద్ద నిరంతర పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమేరాలు, డ్రోన్‌ల ద్వారా పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తాం. ఎన్నికల విధులకు ఆంటకం కలిగించేలా వ్యవహరించరాదు. లెక్కింపు కేంద్రాల్లోకి ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలను తీసుకెళ్లరాదు. ఎన్నికల నిబంధనలు, పోలీస్‌యాక్ట్-30 అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు.. సెక్షన్ 144 ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి. లెక్కింపు పూర్తయ్యే వరకూ అభ్యర్థులు, వారి అనుచరులు సంయమనం పాటించాలి. ఫలితాలు అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడం చేయరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవ’ని ఎస్పీ తెలిపారు.