Share News

వైస్‌ చైర్మన్లు ఎవరో?

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:50 PM

పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో వైస్‌చైర్మన్‌ల పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది.

 వైస్‌ చైర్మన్లు ఎవరో?

- పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో తీవ్ర పోటీ

- పెరుగుతున్న ఆశావహులు

- ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు

- అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూపు

పలాస/ ఇచ్ఛాపురం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో వైస్‌చైర్మన్‌ల పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ మేరకు ఈ నెల 23న వైస్‌చైర్మన్ల ఎంపిక జరగనుంది. దీంతో పలాస, ఇచ్ఛాపురంలో ఆశావహులు ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వైస్‌చైర్మన్‌ల ఎంపిక తుది నిర్ణయం అధిష్ఠానానిదే. దీంతో అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీని టీడీపీ దక్కించుకుంది. మునిసిపల్‌ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా వజ్జ గంగాభవాని విజయం సాధించారు. ఇక వైస్‌చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఏకంగా కూటమికి 31 వార్డు స్థానాలు రావడంతో ఇక్కడ వైస్‌ చైర్మన్‌ పదవి కోసం కౌన్సిలర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే రెండు, మూడుసార్లు కౌన్సిలర్లగా గెలిచిన వారు వైస్‌చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. అనేక మంది ఆశావహులు ఎమ్మెల్యే గౌతు శిరీష కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని ఆమెను కోరుతున్నారు.

ఆ విధానాన్ని కొనసాగిస్తారా?

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలు. రెండు పట్టణాలు కలిసే ఉంటాయి. పలాసకు చెందిన నేతకు చైర్మన్‌ పదవి ఇస్తే కాశీబుగ్గకు చెందిన నేతకు వైస్‌చైర్మన్‌, కాశీబుగ్గ ప్రాంతానికి చైర్మన్‌ పదవి దక్కితే పలాసకు వైస్‌ చైర్మన్‌ ఇవ్వడమనే విధానం మునిసిపాలిటీలో కొనసాగుతూ వస్తోంది. పలాసకు చెందిన వజ్జ గంగాభవాని చైర్మన్‌గా గెలవడంతో కాశీబుగ్గలో ఉన్న సీనియర్లు వైస్‌చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. అయితే పలాసలో వరుసగా నాలుగోసారి కౌన్సిలర్‌గా గెలిచిన గురిటి సూర్యనారాయణ కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. తన సీనియార్టీని గుర్తించాలని, గతంలో తనకు వైస్‌చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉందని ఆయన చెబుతున్నారు. మరోపక్క తాను చైర్మన్‌ పదవి ఆశించినా వేర్వేరు కారణాలతో పొందలేకపోయానని, కనీసం తన అనుచరులకైనా ఆ పదవి ఇవ్వాలని రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు కోరుతున్నారు. అలాగే మున్సిపాలిటీ చరిత్రలో 800కు పైగా ఓట్ల మెజార్టీ సాధించిన తన భార్యను వైస్‌ చైర్‌పర్సన్‌ను చేయాలని సీనియర్‌ నాయకుడు గోళ్ల చంద్రరావు అడుగుతున్నారు. సీనియర్‌ కౌన్సిలర్‌ మల్లా కృష్ణారావు కూడా ఈ రేస్‌లో ఉన్నారు. కులబలంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా, సమాజసేవలో ఉన్న తాను కూడా ఈ పదవి ఆశిస్తున్నానని చెబుతున్నారు.

అధిష్ఠానం నిర్ణయమేంటో?

ఎమ్మెల్యే శిరీష పలాసకు చెందిన టీడీపీ సీనియర్‌ కార్యకర్త, కౌన్సిలర్‌ టంకాల రవిశంకర్‌గుప్తాకు వైస్‌ చైర్మన్‌ పదవి ఇస్తామని బహిరంగంగానే చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇచ్చినమాటకు కట్టుబడి రవిశంకర్‌గుప్తాను వైస్‌ చైర్మన్‌ను చేస్తారా? లేక పాత విధానం ప్రకారం కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్లకు ఈ పదవి ఇస్తారా? అన్నది అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

ఇచ్ఛాపురంలోనూ కుల సమీకరణాలు

ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌గా ఆశి లీలారాణి ఘన విజయం సాధించారు. మొత్తం 28 వార్డులకు గాను టీడీపీ 15 చోట్ల, జనసేన 4 చోట్ల మొత్తం 19 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. అయితే, వైస్‌ చైర్మన్‌ పదవి కోసం ప్రధానంగా టీడీపీలో గట్టి పోటీ నెలకొంది. ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత చైర్‌పర్సన్‌ లీలారాణి రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈసారి యాదవులతోపాటు బీసీలకు రెండో పదవి ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే 24, 25 వార్డు టీడీపీ కౌన్సిలర్లు కాళ్ల జయదేవ్‌, ప్రియ పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయి. వీరిద్దరూ దంపతులు. పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన కాళ్ల ధర్మారావు కుమారుడే జయదేవ్‌. ధర్మారావు 1987, 1995లో కౌన్సిలర్‌గా పని చేశారు. 1995లో ఆయన భార్య వెంకటలక్ష్మి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రాతినిథ్యం వహించారు. 2014, 2021లో కూడా కౌన్సిలర్‌గా గెలుపొందారు. మునిసిపాల్టీలో ప్రతి ఎన్నికల్లోనూ ఆయన కుటుంబసభ్యులు కౌన్సిలర్లగా గెలుస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ పదవి ఆశించారు. కానీ దక్కలేదు. అందుకే వైస్‌ చైర్మన్‌గా తన కుమారుడుకు కానీ, కోడలికి కానీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

- మరోవైపు కాళ్ల దిలీప్‌ భార్య మనోజ సైతం ఈ పదవిని ఆశిస్తున్నారు. దిలీప్‌ తండ్రి అర్జున టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. 2000లో దిలీప్‌ పిన్ని కమల, 2021 ఎన్నికల్లో దిలీప్‌ కౌన్సిలర్లగా గెలిచారు. ఇప్పుడు దిలీప్‌ భార్య మనోజ కౌన్సిలర్‌గా ఎన్నికై వైస్‌చైర్‌పర్సన్‌ పదవికి పోటీ పడుతున్నారు. మరోవైపు కళింగ వైశ్య సామాజిక వర్గం నుంచి వెచ్చ కేశవరావు వైస్‌ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. అలాగే రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌రెడ్డి భార్య భారతి కూడా వైస్‌ చైర్‌పర్సన్‌ రేసులో ఉన్నారు.

- జనసేన నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు సోదరుడు.. దాసరి శేఖర్‌ వైస్‌ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా ఇచ్ఛాపురం మునిసిపాల్టీని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. కానీ, టీడీపీకి దక్కింది. కనీసం వైస్‌ చైర్మన్‌ పదవైనా ఇవ్వాలని జనసేన నేతలు కోరే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఇచ్ఛాపురం జడ్పీటీసీ పదవిని జనసేనకు కేటాయించారు. దీంతో వైస్‌ చైర్మన్‌ పదవి ఇవ్వకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఎవరిని వైస్‌చైర్మన్‌/ చైర్‌పర్సన్‌ పదవి వరిస్తుందో వేచిచూడాలి.

Updated Date - Nov 11 , 2026 | 11:50 PM