Share News

వృద్ధురాలి హత్య వెనుక పాత్రధారులెవరు?

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:36 AM

Raids on woman lawyer's house జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు(70) అనే వృద్ధురాలి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. నోటరీ కోసం ఈ నెల 17న నరసన్నపేట వచ్చిన ఆ వృద్ధురాలు అదృశ్యమైంది.

వృద్ధురాలి హత్య వెనుక పాత్రధారులెవరు?
మహిళా న్యాయవాది ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్తున్న పోలీసులు

  • పోలీసుల ముమ్మర దర్యాప్తు

  • మహిళా న్యాయవాది ఇంట్లో సోదాలు

  • మరికొంతమంది అనుమానితుల విచారణ

  • నరసన్నపేట, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు(70) అనే వృద్ధురాలి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. నోటరీ కోసం ఈ నెల 17న నరసన్నపేట వచ్చిన ఆ వృద్ధురాలు అదృశ్యమైంది. 22న హిరమండలం సమీపాన పిండ్రువాడ గెడ్డలో ఓ మూటలో ఆమె మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే. కాగా.. ఆమె ధరించిన బంగారు ఆభరణాలను దోపిడీ చేసి.. దుండగలు హతమార్చారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు నరసన్నపేటలోని గవర్నమెంట్‌ ఆస్పత్రి రోడ్డులో ఒక మహిళా న్యాయవాది ఇంటికి నోటరీ కోసం వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆమె ఆచూకీ లేకపోవడం.. ఫోన్‌ కూడా పనిచేయకపోవడం.. బంగారు ఆభరణాలు మాయమవడం.. ఆరు రోజుల తర్వాత గెడ్డలోని ఓ మూటలో విగతజీవిగా బయటపడడం వెనుక కారకులు ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. సోమవారం మహిళా న్యాయవాది ఇంట్లో సోదాలు చేశారు. క్లూస్‌టీమ్‌ను కూడా రంగంలోకి దించారు. కీలక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది.

  • 2007లో నరసన్నపేటలో పక్కింట్లో నివసిస్తున్న టైలర్‌ దంపతుల హత్య వ్యవహారంలో మహిళా న్యాయవాదిపై కేసు నమోదైంది. తాజాగా వృద్ధురాలి హత్య ఘటన నేపథ్యంలో ఆ మహిళా న్యాయవాది ఫోన్‌ డేటా ఆధారంగా పోలీసులు ఆమె కదలికలపై నిఘా పెట్టారు. మహిళ న్యాయవాదితోపాటు ఆమె కుమారుడు ఫోన్‌ డేటా ఆధారంగా ఈ హత్యకు సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. ఎక్కడ హత్య చేశారు.. దానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Updated Date - Aug 25 , 2026 | 12:36 AM