నువ్వు పంటను కల్లానికి తెస్తుండగా..
ABN , Publish Date - May 25 , 2026 | 11:57 PM
మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన చల్ల బాలరాజు (57) అనే రైతు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు.
- ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి
జలుమూరు, మే 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన చల్ల బాలరాజు (57) అనే రైతు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాలరాజు తన పొలంలోని నువ్వు చేనును ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌తో కల్లానికి తరలిస్తుండగా శ్రీముఖలింగం రోడ్డుకు వెళ్లే మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో డైవింగ్ చేస్తున్న బాలరాజు ట్రాక్టర్ నుంచి కిందకు జారిపడిపోయాడు. దీంతో వెనుక తొట్టె ఆయన పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. తక్షణమే స్థానికులు 108 వాహనం ద్వారా శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ రాజశేఖర్ తెలిపారు. ఇతనికి కుమార్తె శ్రీలత ఉంది. కుటుంబాన్ని పోషించే యజమాని ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో భార్య, కుమార్తె బోరున విలపిస్తున్నారు.