Share News

అమ్మవారిని దర్శించుకుని వెళ్తుండగా..

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:25 AM

Car hits auto.. accident వారంతా అప్పటివరకు ఎంతో సందడిగా గడిపారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు కూడా తీర్చుకున్నారు. అనంతరం ఆటోలో ఇంటికి వెళ్తుండగా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో సవలాపురపు రమేష్‌(41) అనే వ్యక్తి మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు.

అమ్మవారిని దర్శించుకుని వెళ్తుండగా..
ప్రమాదంలో నుజ్జయిన ఆటో

అజ్జరాం జంక్షన్‌ వద్ద ఆటోను ఢీకొన్న కారు

ఒకరి మృతి.. 9 మందికి గాయాలు

బాధితులంతా విశాఖ వాసులే

ఎచ్చెర్ల, మార్చి 8(ఆంధ్రజ్యోతి): వారంతా అప్పటివరకు ఎంతో సందడిగా గడిపారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు కూడా తీర్చుకున్నారు. అనంతరం ఆటోలో ఇంటికి వెళ్తుండగా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో సవలాపురపు రమేష్‌(41) అనే వ్యక్తి మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఎచ్చెర్ల మండలం అజ్జరాం జంక్షన్‌ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా చినముసిడివాడకు చెందిన తొమ్మిది మంది గార మండలం వత్సవలసలోని రాజులమ్మ దర్శనానికి శనివారం సాయంత్రం ఆటోలో బయలుదేరారు. శనివారం అర్ధరాత్రికి వత్సవలస చేరుకుని అక్కడే రాత్రి బసచేశారు. ఆదివారం ఉదయం రాజులమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తుండగా ఎచ్చెర్ల మండలం అజ్జరాం జంక్షన్‌ జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో ఆటో బోల్తాపడి నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న సవలాపురపు రమేష్‌, నక్క తవుడు, ధర్మవరపు చినగవరశెట్టి, ధర్మవరపు గౌతమి, ధర్మవరపు తులసిరెడ్డి, గణపతి, పార్వతి, తామాడ నాగమణి, రాంబాబుతో పాటు కారులో ఉన్న చిన్నారి జి.పల్లవి గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సవలాపురపు రమేష్‌ మృతిచెందాడు. మిగతా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారుడ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు.

Updated Date - Mar 09 , 2026 | 12:25 AM