నీట మునిగిన తమ్ముడ్ని రక్షించబోయి..
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:17 AM
నీటిలో ముని గిపోతున్న తన తమ్ముడ్ని కాపాడేందుకు వెళ్లి అన్నయ్య మృతి చెందిన ఘటన మేజర్ పంచాయతీ టెక్కలి పరిధి గోపినాఽథపురంలో మంగళవారం చోటు చేసుకుంది.
అన్న మృతి.. గోపినాఽథపురం చెరువు వద్ద ఘటన
టెక్కలి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): నీటిలో ముని గిపోతున్న తన తమ్ముడ్ని కాపాడేందుకు వెళ్లి అన్నయ్య మృతి చెందిన ఘటన మేజర్ పంచాయతీ టెక్కలి పరిధి గోపినాఽథపురంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మందస మండలం మకరజోల గ్రామానికి చెందిన గూన నారాయణరావు, అప్పలకొండ దంపతులకు ఇద్దరు కుమారులు ధనుష్ (21), కుమార్ ఉన్నారు. వీరిద్దరూ గోపినాథపురంలో గల అమ్మమ్మ ఇంటికి ఇటీవల వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం వీరిద్దరూ స్నానం కోసం సమీపంలోని చెరువు వెళ్లారు. ఈ క్రమంలో కుమార్ నీటిలో మునిగిపోతుండడంతో కాపాడేం దుకు వెళ్లిన ధనుష్ ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. అటుగా వెళ్లిన కొందరు ఈ ఘటన చూసి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే ధనుష్ మృతిచెందాడు. అన్న మృతదేహం వద్ద తమ్ముడు కుమార్ గుండెలు విలసేలా రోదించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అప్పలకొండ, నారాయణరావు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అనంతరం మృతిచెందిన ధనుష్ మృతదేహాన్ని స్వగ్రామమైన మకరజోల తరలించారు. కాగా మృతిచెందిన ధనుష్ విశాఖలోని పీఎం పాలెంలో గల ఓ కళాశాలలో ఇంజనీ రింగ్ చదువుతున్నాడు. అయితే ఈ ఘటనపై ఎటువంట ఫిర్యాదు అందలేదని సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.
చెరువులో పడి మహిళ మృతి
రణస్థలం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మండల పరిధి వీఎన్‌పురం గ్రామానికి చెందిన పుణ్యవతి (43) చెరువులో పడి మృతి చెందింది. జేఆర్‌పురం ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం మధ్యాహ్నం దుస్తులు ఉతికేందుకు చెరువుకు వెళ్లిన పుణ్యవతి ప్రమాదవశాత్తు కాలుజారీ చెరువులో పడి అక్కడికక్కడే మృతి చెందింది. చెరువులో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యుల సహకారంతో పుణ్యవతి మృతదేహాన్ని రాత్రి బయటకు తీశారు. భర్త కల రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
రోడ్డు ప్రమాదం కేసులో వ్యక్తి అరెస్టు
పలాసరూరల్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదం కేసులో ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గారబంద బ్లాక్ భీమపురం గ్రామానికి చెందిన సవర నాగేష్ అనే వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ ఎం.అప్పారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. నగేష్ ఈ ఏడాది ఆగస్టు 31న మొగిలిపాడు జంక్షన్ వద్ద మద్యం మత్తులో ద్విచక్రవాహనం నడిపి ఓ వ్యక్తిని ఢీకొట్టి.. ఆ ఘటనలో అతడు మరణించాడు. ఈ కేసును దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించిన తర్వాత నగేష్‌ను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.