Share News

విధులకు వెళుతుండగా..

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:08 AM

విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ ప్రభుత్వ ఉద్యోగి మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.

   విధులకు వెళుతుండగా..
శేఖర్‌బాబు (ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌వో దుర్మరణం

అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ ప్రభుత్వ ఉద్యోగి మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆమదాలవలస తహసీల్దార్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌వో)గా పనిచేస్తున్న నూనె శేఖర్‌బాబు (45) తన భార్య కర్రోతు వెంకటలక్ష్మితో కలిసి శ్రీకాకుళం కొత్తరోడ్డు సమీపంలో నివాసం ఉంటున్నారు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లేందుకు గాను మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బైక్‌పై ఆమదాలవలస బయలుదేరారు. మార్గమధ్యంలో వర్షం కురవడంతో సనపలవానిపేట వద్ద కంటిపై పడిన వర్షపు నీటిని తుడుచుకునే క్రమంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అతని ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి ఆమదాలవలస తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్‌ సత్యంతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకుని శేఖర్‌బాబు కుటుంబానికి సమాచార మందించారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి పొందూరు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సోషల్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి వివాహం జరిగి ఐదేళ్లు అయినా సంతానం లేదు. కుటుంబానికి అండగా నిలుస్తున్న భర్త ఆకస్మికంగా మృతిచెందడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగి పోయారు. శేఖర్‌బాబు స్వస్థలం ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండలం సంతరావూరు గ్రామం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. రూరల్‌ ఎస్‌ఐ కరణం వెంకటసురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Oct 28 , 2026 | 12:08 AM