కాశీకి వెళ్తుండగా.. ట్రావెల్స్ బస్సు బోల్తా
ABN , Publish Date - May 17 , 2026 | 11:59 PM
Travel bus overturns మండలంలోని బూరగాం జాతీయ రహదారి వద్ద శనివారం అర్ధరాత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా, 40 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇద్దరికి స్వల్ప గాయాలు
40 మంది యాత్రికులు సురక్షితం
బాధితులంతా కర్నూలు వాసులే
కంచిలి, మే 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బూరగాం జాతీయ రహదారి వద్ద శనివారం అర్ధరాత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా, 40 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడువూరు మండలం దొడ్డిమేకల గ్రామం నుంచి ఈనెల 14వ తేదీ రాత్రి 10 గంటలకు 40మంది యాత్రికులతో ట్రావెల్స్ బస్సు కాశీకి బయలుదేరింది. సుమారు 30 క్షేత్రాలను దర్శించుకోవాలని యాత్రికులు అనుకున్నారు. అయితే, శనివారం అర్ధరాత్రికంచిలి మండలం బూరగాం సమీపానికి వచ్చే సమయంలో పక్కనుంచి వస్తున్న లారీ తగులుతుందేమోనని డ్రైవర్ దాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి రోడ్డుపక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ నాగూరు వీరప్రతాప్ రెడ్డితో పాటు పామిడి గ్రామానికి చెందిన ట్రావెల్స్ ఏజెంట్ ఆదినారాయణరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. యాత్రికులందరూ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితులకు తాత్కాలిక బస ఏర్పాటు చేసి వారికి కావలసిన కిరాణా, కాయగూరలు సమకూర్చారు. మరొక బస్సు వచ్చేంత వరకు వారికి ఆశ్రయం కల్పించినట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటనపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. స్థానిక టీడీపీ నాయకుడు బొడ్డు అప్పారావుతోపాటు గ్రామయువకులు సంఘటనా స్థలానికి చేరుకుని యాత్రికులకు సహకారం అందజేశారు.