చెరువులో స్నానం చేస్తుండగా...
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:58 PM
మందస మండలం పితాతోళి పంచాయతీ పుచ్చపాడు గ్రామంలో చెరువులో స్నానం చేస్తుండగా పిడుగు పడడంతో వృద్ధుడు మృతి చెందాడు.
- పిడుగు పడి వృద్ధుడి మృతి
-మందస మండలం పుచ్చపాడులో ఘటన
హరిపురం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): మందస మండలం పితాతోళి పంచాయతీ పుచ్చపాడు గ్రామంలో చెరువులో స్నానం చేస్తుండగా పిడుగు పడడంతో వృద్ధుడు మృతి చెందాడు. గ్రామస్థుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన శిష్టు భీమారావు(69) పొలంలో నువ్వు చేను తీసి ఇంటికి బయలుదేరాడు. గ్రామంలోని చెరువు వద్ద స్నానం చేస్తుండగా పిడుగు పడడంతో కుప్పకూలిపోయాడు. సమీపంలోని ఆలయం వద్ద నుంచి గ్రామస్థులు చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే వెళ్లి భీమారావును బయటకు తీసి వైద్యులతో పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. భీమారావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగి వేర్వేరు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ పరిశీలించారు. మృతదేహాన్ని హరిపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.