Share News

ఎక్కడ బోట్లు అక్కడే

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:25 AM

Fishing ban from 15th సముద్ర తీరం ఇక నిశ్శబ్దం కానుంది. ఎక్కడి బోట్లు అక్కడే అన్నట్టు ఒడ్డుకు చేరుకోనున్నాయి. చేపలు గుడ్లు పెట్టే దశలో మోటారు, మెకనైజ్డ్‌ బోట్లతో వేటాడితే మత్స్యసంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపద ఉత్పత్తి, సంరక్షణలో భాగంగా సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు(మెకనైజ్డ్‌ బోట్లు), మోటారు బోట్లతో నిర్వహించే అన్నిరకాల చేపలవేటకు రెండు నెలలపాటు విరామం ప్రకటించింది.

ఎక్కడ బోట్లు అక్కడే
డి.మత్స్యలేశం తీరంలో మోటారు బోటును ఒడ్డుకు చేరుస్తున్న మత్స్యకారులు(ఫైల్‌)

- చేపలవేటకు విరామం

- ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి అమలు

- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

- 17 నుంచి గణన

ఎచ్చెర్ల/ సోంపేట రూరల్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): సముద్ర తీరం ఇక నిశ్శబ్దం కానుంది. ఎక్కడి బోట్లు అక్కడే అన్నట్టు ఒడ్డుకు చేరుకోనున్నాయి. చేపలు గుడ్లు పెట్టే దశలో మోటారు, మెకనైజ్డ్‌ బోట్లతో వేటాడితే మత్స్యసంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపద ఉత్పత్తి, సంరక్షణలో భాగంగా సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు(మెకనైజ్డ్‌ బోట్లు), మోటారు బోట్లతో నిర్వహించే అన్నిరకాల చేపలవేటకు రెండు నెలలపాటు విరామం ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్‌ 14 వరకు వేట నిషేధం అమలు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఈ నెల 15 నుంచి సముద్రంలో మరబోట్లతో చేపలవేటకు వెళ్లరాదని, నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. సంప్రదాయ తెప్పలతో వేట సాగించవచ్చని సూచించారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలో 193 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరప్రాంత విస్తరించి ఉంది. 11 మండలాల్లో 104 సముద్ర తీరగ్రామాలు ఉన్నాయి. మత్స్యశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 1623 మోటారైజ్డ్‌ బోట్లు, 2805 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. 60 ప్రాంతాల్లో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు ఉన్నాయి. కాగా.. కొన్నాళ్ల కిందట ఈ ప్రాంత మత్స్యకారులు సంప్రదాయ తెప్పలతోనే చేపలు వేటాడేవారు. ప్రభుత్వం రాయితీపై మోటారు బోట్లను సరఫరా చేయడంతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపుగా ప్రతి తీర గ్రామంలో పది నుంచి 15 వరకు మోటారుతో పనిచేసే బోట్లు ఉన్నాయి. ఒక్కోబోటుపై 8 నుంచి 10 మంది వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్తుంటారు. సంప్రదాయ తెప్పలతో 8 కిలోమీటర్లకు మించి చేపల వేట సాగించలేరు. అదే మోటారైజ్‌డ్‌ బోట్లతో అయితే 50 కిలో మీటర్ల వరకు ప్రయాణించి చేపల వేట సాగిస్తారు. నిషేధం సమయంలో చాలా వరకు మత్స్యకారులకు పని ఉండదు. ఈ నేపథ్యంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు.. ప్రభుత్వం ‘భరోసా’ కల్పిస్తోంది. గతంలో రూ.2వేలు ఉన్న మత్స్యకార భరోసాను టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4వేలకు పెంచింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని రూ.10వేలకు పెంచింది. తాజాగా కూటమి ప్రభుత్వం.. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద పరిహారాన్ని రెట్టింపు చేస్తూ.. ఒక్కొక్కరికీ రూ.20వేలు చొప్పున అందజేస్తోంది. జిల్లాలో గతేడాది 15,548 కుటుంబాలకు రూ.20వేల చొప్పున పరిహారాన్ని అందజేసింది. చేపలు వేటాడే మత్స్యకారులను గుర్తించేందుకు ఈ నెల 17 నుంచి గణన (ఎన్యుమరేషన్‌)చేయనున్నారు. ఇదిలా ఉండగా వాడబలిజ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, వలసలు నివారించాలని సోంపేట మండలం ఎకువూరు, నడుమూరు, బట్టిగళ్లూరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు కోరుతున్నారు. వేట నిషేధ సమయంలో అర్హులైన మత్స్యకారులందరికీ భరోసా అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అర్హులందరికీ భరోసా

మత్స్యకారులకు చేపల వేటే జీవనాఽధారం. 2 నెలల పాటు చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఉపాధి కరువే. అర్హులైన మత్స్యకారులందరికీ భరోసాగా పరిహారం ఇవ్వాలి. గుజరాత్‌, కర్ణాటక తదితర ప్రాంతాలకు వలసవెళ్లిన మత్స్యకారులు కూడా స్వగ్రామాలకు చేరుకుంటారు.

- అల్లుపల్లి రాంబాబు, మాజీ సర్పంచ్‌, బుడగట్లపాలెం, ఎచ్చెర్ల మండలం

నిషేధం అమలుకు సహకరించాలి

సముద్ర జలాల్లో మోటారు, మెకనైజ్డ్‌ బోట్లతో ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు చేపల వేట నిషేధానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై తీర గ్రామాల్లో మత్స్యకారులకు అవగాహన కల్పిస్తాం. దండోరా కూడా వేస్తాం. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద పరిహారం చెల్లింపునకు వీలుగా ఈ నెల 17 నుంచి మత్స్యకార గణన చేపడతాం. మత్స్య, రెవెన్యూ, మెరైన్‌శాఖలు సంయుక్తంగా నిషేధం అమలుకు చర్యలు తీసుకుంటాం. మత్స్యకారులు సహకరించాలి.

- వై.సత్యనారాయణ, ఉప సంచాలకులు, మత్స్యశాఖ

Updated Date - Apr 12 , 2026 | 12:25 AM