‘ఓటు’ ఎక్కడ వేద్దాం?
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:35 AM
Dilemma over voters registered in two places ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియతో కొంతమంది ఓటర్లకు కొత్త చిక్కు వచ్చింది. జిల్లాలో చాలామంది ఓటర్లకు రెండేసి చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు. స్వగ్రామాల్లోనూ.. ఉపాధి నిమిత్తం నివసిస్తున్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో కూడా ఓటుహక్కు పొందారు.
రెండుచోట్ల నమోదైన ఓటర్ల తర్జనభర్జన
‘సర్’ ప్రక్రియలో భాగంగా ఒక్కచోటే అవకాశం
మెళియాపుట్టి, జూలై 11(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మిపురంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన అడబ, బుసికిడి, పర్లాఖిమిడి, నీలాపురం, నరహరిపురంతోపాటు నందిగాం మండలం నౌగాం వంటి గ్రామాలకు చెందిన పలువురు నివసిస్తున్నారు. వారికి స్వగ్రామాలతోపాటు పెద్దలక్ష్మిపురంలో కూడా ఓట్లు ఉన్నాయి. వీరి ఓట్లు స్థానిక ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులు వారి ఓట్లు తొలగించకుండా కొనసాగిస్తున్నారు. కాగా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు.. రెండుచోట్ల నమోదైన వారి ఓట్లను ఓటర్ల అంగీకారం మేరకు ఒక చోట తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటు ఎక్కడ ఉంచుకోవాలో తెలియక పలువురు ఓటర్లు తర్జనభర్జన పడుతున్నారు.
మెళియాపుట్టి మండల జలగలింగుపురానికి చెందిన కొంతమంది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారికి ఇక్కడ.. అక్కడ.. రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. జలగలింగుపురంలో భూములు, ఇళ్లు సైతం ఉన్నాయి. కానీ, 20ఏళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మనుగడ దృష్ట్యా హైదరాబాద్‌లోనే ఓట్లు ఉంచుకోవడానికి కొంతమంది సిద్ధపడుతున్నారు. కాగా.. జలగలింగుపురంలోనే ఓట్లు ఉంచేలా స్థానిక నేతలు వారిపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు ఎక్కడ ఓటు ఉంచుకోవాలో.. తెలియక సతమతమవుతున్నారు.
టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామానికి చెందిన కొంతమంది ఓట్లు టెక్కలిలో కూడా ఉన్నాయి. వీరిది కూడా అదే పరిస్థితి. ఎక్కడ ఓటు ఉంచాలా? అని ఆలోచనలో పడ్డారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియతో కొంతమంది ఓటర్లకు కొత్త చిక్కు వచ్చింది. జిల్లాలో చాలామంది ఓటర్లకు రెండేసి చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు. స్వగ్రామాల్లోనూ.. ఉపాధి నిమిత్తం నివసిస్తున్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో కూడా ఓటుహక్కు పొందారు. ఇన్నాళ్లూ ఎన్నికల షెడ్యూల్ కలసివస్తే.. రెండుచోట్లా ఓట్లు వేసేవారు. స్వగ్రామాలకు వెళ్లి పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేవారు. మళ్లీ పట్టణాల్లో నివాస ప్రాంతాలోని.. మునిసిపల్, కార్పొరేషన్, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటు వేసేవారు. కానీ ఇకపై ఆ అవకాశం లేదు. ఎక్కడో ఒకచోట మాత్రమే ఓటుహక్కు కొనసాగించి.. ఓటు వేయాలి. ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటర్ల అంగీకారం మేరకు ఒకచోట మాత్రమే ఓటు ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మిగిలిన చోట్ల ఓట్లు తొలగించనున్నారు. ఇందుకు సంబంధించి ఇంటింటా సర్వే చేపట్టి.. ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. ఈ నేపథ్యంలో తమ ఓటు ఎక్కడ కొనసాగించాలో.. ఎక్కడ వదులుకోవాలో.. తెలియక కొంతమంది ఓటర్లు తర్జనభర్జన పడుతున్నారు.
జిల్లాలో అధికంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజల ఓట్లు ఉన్నాయి. మెళియాపుట్టి, కొత్తూరు, మందస, ఇచ్ఛాపురం, సోంపేట, పాతపట్నం, కవిటి, కంచిలి, హిరమండలం వంటి మండలాల్లో ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వారి ఓట్లు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మరికొంతమది పట్టణ ప్రాంతాల్లో కూడా ఓట్లు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 25వేల మంది వలస ఓటర్లు ఉన్నారు. చాలామంది హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నారు. అటువంటి వారికి స్వగ్రామాలతోపాటు.. హైదరాబాద్‌లో కూడా ఓటుహక్కు ఉంది. కాగా.. ఆయా ఓటర్లు ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఓటు మ్యాపింగ్ చేసుకోవాలి. అక్కడే ఓటుహక్కు వినియోగించుకోవాలి. కాగా.. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ విజయానికి అనుకూలమైన ఓటర్లపై స్థానిక నేతల ఒత్తిడి కనిపిస్తోంది. స్వగ్రామాల్లోనే ఓట్లు కొనసాగించేలా ప్రయత్నం చేస్తున్నారు.
దొరకని ఓటర్లు
‘సర్’ సర్వేలో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటికీ తిరుగుతున్నారు. 2002 ఓటర్ల జాబితాలో ఉన్న చిరునామా ఆధారంగా ఓటర్లను గుర్తిస్తున్నారు. అయితే పట్టణాల్లో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటూ తరచూ మారడం వల్ల ఓటర్లు చిరునామాలు తెలియక బీఎల్‌వోలు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం కష్టతరంగా మారింది. కొంత మంది సొంత ఇళ్లను అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకున్నారు. ఇప్పుడు వీరిందరిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. కాగా.. ఎన్యూమరేషన్ ప్రతాలు తిరిగి బిఎల్‌వోలకు ఈనెల 14 లోపు ఇవ్వాలి. ఇవ్వనివారిని వలస ఓటర్లుగా గుర్తించే అవకాశం ఉంది. ఒకే దగ్గర ఓటు
రెండు దగ్గర ఓట్లు ఉన్నవారికి ముందుగా బీఎల్‌వో ఎక్కడ మ్యాపింగ్ చేస్తారో.. అక్కడే ఓటుహక్కు ఉంటుంది. మిగిలిన డబుల్ ఎంట్రీగా గుర్తించి.. తొలగిస్తారు. ఎక్కడైనా రెండుచోట్ల ఓట్లు ఉన్నట్టు తెలిస్తే ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు.
బి.పాపారావు, తహసీల్దార్, మెళియాపుట్టి