Share News

పర్యాటక ప్రగతి ఏదీ?

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:36 AM

Lack of facilities at beaches జిల్లాలోని తీరప్రాంతాలు పర్యాటకాభివృద్ధికి దూరమవుతున్నాయి. ఇచ్ఛాపురం సరిహద్దున.. ఒడిశాలో ఉన్న సోనాపూర్‌ బీచ్‌లో నిత్యం సందర్శకులు ఉంటారు. అక్కడ అన్నిరకాల సౌకర్యాలు ఉండడంతో సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. కానీ ఇచ్ఛాపురం మండలం డొంకూరు తీరంలో మాత్రం ఆ స్థాయిలో పర్యాటకులు ఉండరు. దానికి కారణం సౌకర్యాలు లేకపోవడమే.

పర్యాటక ప్రగతి ఏదీ?
సౌకర్యాలు లేని బారువా బీచ్‌

  • బీచ్‌ల్లో కనీస వసతులు కరువు

  • సందర్శకులకు తప్పని అవస్థలు

  • ఇచ్ఛాపురం, జూలై 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తీరప్రాంతాలు పర్యాటకాభివృద్ధికి దూరమవుతున్నాయి. ఇచ్ఛాపురం సరిహద్దున.. ఒడిశాలో ఉన్న సోనాపూర్‌ బీచ్‌లో నిత్యం సందర్శకులు ఉంటారు. అక్కడ అన్నిరకాల సౌకర్యాలు ఉండడంతో సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. కానీ ఇచ్ఛాపురం మండలం డొంకూరు తీరంలో మాత్రం ఆ స్థాయిలో పర్యాటకులు ఉండరు. దానికి కారణం సౌకర్యాలు లేకపోవడమే. ఒడిశాతో పోల్చితే.. మనకు పర్యాటకంగా తీర ప్రాంతాలకు నిధుల కేటాయింపు చాలా తక్కువ. దీంతో పర్యాటకాభివృద్ధి కరువవుతోంది. జిల్లాలో సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. డొంకూరు, కవిటి, బారువ, అక్కుపల్లి, భావనపాడు, కళింగపట్నం, మొగదాలపాడు, కళ్లేపల్లి, గనగళ్లపేట, బందరువానిపేట తీరాలు పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. తీర ప్రాంతంలో కొబ్బరి, జీడి, ఇతర ఉద్యాన పంటలు కనువిందు చేస్తాయి. జిల్లాలో బాహుదా, మహేంద్రతనయా, వంశధార, నాగావళి నదీ సంగమాలు ఉన్నాయి. తీరానికి దగ్గరగా పురాణ, చారిత్రక, ఇతిహాసాలతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చిత్తడి, బీల నేలల శోయగం కూడా. విదేశాల నుంచి వేలాది కిలోమీటర్లు దాటుకుంటూ ఇక్కడకు పక్షులు వస్తుంటాయి. పూండి, నౌపడ ఉప్పుగళ్లీలు, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఎర్రమట్టి దిబ్బలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కానీ సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయకపోవడం ఆదరణ కరువవుతోంది. బీచ్‌ల్లో కనీస వసతులు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

  • కళింగపట్నం తీరంలో అధ్వానం

  • గార మండలం కళింగపట్నం బీచ్‌.. టీడీపీ హయాంలో అభివృద్ధి చెందింది. భారీ ఒంటెలతో పాటు కొన్నిరకాల జంతువుల ఆకృతులను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి.. ఆహ్లాదకంగా తీర్చిదిద్దారు. పర్యాటక ఉత్సవాలు కూడా నిర్వహించారు. తీరం వరకూ రహదారులను సైతం ఏర్పాటు చేశారు. గతంలో రిసార్ట్స్‌ సైతం నిర్మించారు. కానీ వైసీపీ పాలనలో ఈ బీచ్‌ పూర్తిగా నిర్వీర్యమైంది. అధ్వానంగా మారింది. నిర్వహణను గాలికొదిలేసిన జగన్‌ సర్కారు రిసార్ట్స్‌లో మాత్రం బార్‌ను నడిపించింది.

  • బెంచీలు కూడా లేవు

  • జిల్లాలోని బీచ్‌ల్లో కనీస వసతులు లేవు. తీరంలో బెంచ్‌ల ఏర్పాటు కూడా లేదు. ఒడిశాలోని సోనాపూర్‌ బీచ్‌ చూస్తే కళ్లు చెదిరిపోతాయి. మన బీచ్‌ల అభివృద్ధి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం.

  • - లోపింటి నరసింహమూర్తి, టీచర్‌, స్థానికుడు, ఇచ్ఛాపురం

  • ఒడిశా బీచ్‌లే దిక్కు

  • కుటుంబంతో బీచ్‌కు వెళితే చక్కగా కూర్చోవడానికి వీలు లేకుండా పోతోంది. ఎండకు, వర్షానికి తలదాచుకుంటామంటే చెట్లే గతి అవుతున్నాయి. అందుకే జిల్లా నుంచి ప్రజలు సేద తీరేందుకు ఒడిశా వెళుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరముంది.

  • - సీహెచ్‌ వెంకటరమణ, టీచర్‌, ఇచ్ఛాపురం

Updated Date - Jul 31 , 2026 | 12:36 AM