Share News

గౌరవ వేతనమేదీ?

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:29 AM

Funds fail to reach election staff పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయి సభ్యుల ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా ఖరారైంది. కానీ కొంతమంది ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, సిబ్బందికి గౌరవ వేతనం ఇంకా చెల్లించలేదు.

గౌరవ వేతనమేదీ?
పలాసలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది(ఫైల్‌)

ఎన్నికల సిబ్బందికి అందని డబ్బులు

ఆర్టీసీకి భారీగా బకాయిలు

పలాస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయి సభ్యుల ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా ఖరారైంది. కానీ కొంతమంది ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, సిబ్బందికి గౌరవ వేతనం ఇంకా చెల్లించలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఎన్నికల సామగ్రిని, సిబ్బందిని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన వినియోగించారు. ఈ బస్సుల అద్దెలు ఇంకా జమ చేయలేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. గౌరవ వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.

పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ ఎన్నికలు ఈ నెల 1న జరగ్గా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 5న నిర్వహించారు. వాస్తవానికి ఎన్నికల రోజునే అధికారులు, సిబ్బందికి గౌరవ వేతనాలు చెల్లించాలి. కానీ స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో అధికారులు వాటిని ఇవ్వలేకపోయారు. గత ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆర్వోలు, ఈవోలకు వేతనాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఒక్క ఆర్టీసీ సంస్థకే రూ.3 లక్షల బకాయి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్వోలు, ఈవోలకు గౌరవ వేతనం ఇచ్చేందుకుగానూ... ఎన్నికల కమిషన్‌ ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. మిగిలిన సిబ్బంది వేతనాలు ఖరారైనా.. ఎంత మొత్తం ఇవ్వాలన్నది పొందుపరచకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉంది. పలాస మండల ఎన్నికల నిర్వహణకు రూ.7.50 లక్షల నగదు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తం విధులు నిర్వహించిన సిబ్బంది జీతభత్యాలకే సరిపోయింది. దీంతో అధికారులు అదనంగా మండల నిధులు రూ.2 లక్షల మేర విత్‌డ్రా చేసి బకాయిలు చెల్లించారు. అద్దెకు తీసుకున్న బస్సులు, కారులు, వ్యాన్‌లకు ఇంకా డబ్బులు చెల్లించలేదు. ఇక్కడ కూడా ఆర్వోలు, ఈవోలకు నగదు చెల్లించాల్సి ఉంది. ఒక్కో వీఆర్వోకు రూ.15వేలకు పైగా ఎన్నికల ఖర్చు అదనంగా అయింది. దీంతో తమకు డబ్బులు వస్తాయా? రావోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

పలాస ఎంపీడీవో సెలవుపై ఉండడంతో ఇన్‌చార్జి ఎంపీడీవోతోనే ఎన్నికలు జరిగాయి. మొత్తం రూ.12 లక్షలకు పైగా బకాయిలు ఉన్నాయి. అంత మొత్తం ఏ విధంగా చెల్లించాలన్న సందిగ్ధంలో ఇన్‌చార్జి ఎంపీడీవో ఉన్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో సిబ్బందితోపాటు ఆర్వోలు, ఈవోలు, రూట్‌ అధికారులు, ఆర్టీసీ, అద్దె కార్లు, భోజనాలకు సంబంధించి ఇంకా డబ్బులు చెల్లించలేదు. రూ.15 లక్షల వరకూ బకాయిలు ఉన్నాయని ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడు తెలిపారు. బకాయిల నివేదికను జడ్పీ ఉన్నతాధికారులకు, ఎన్నికల కమిషన్‌కు అందజేశామన్నారు.

మందస మండల ఎన్నికలకు సంబంధించి కూడా సిబ్బందికి వేతనాల బకాయిలు ఉన్నాయి. ఆర్టీసీ, రూట్‌అధికారులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది, టెంట్లు, భోజన ఖర్చులకు ఇంకా డబ్బులు చెల్లించలేదు. ఉన్నతాధికారులు స్పందించి తమకు గౌరవ వేతనం అందజేయాలని ఆయా సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - Nov 14 , 2026 | 12:29 AM