ఆమదాలవలసలో ఆహ్లాదం ఏదీ?
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:11 AM
Lack of interest in parks ఆమదాలవలస మునిసిపాలిటీలో ఆహ్లాదం కరువవుతోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకూ సాయంత్రం వేళ ప్రశాంతంగా సేదతీరేందుకు ఏర్పాటు చేసిన పార్క్‌లు గత పాలకుల తీరుతో నిర్లక్ష్యానికి గురయ్యాయి. మునిసిపాలిటీ పరిధిలోని బొడ్డేపల్లి రాజగోపాలరావు(బీఆర్) నగర్ కాలనీలో అమరావతి పార్క్ అధ్వానంగా దర్శనమిస్తోంది.
పార్క్‌లకు ఆదరణ కరువు
ఎక్కడ చూసినా అధ్వానమే
కొత్త పాలకవర్గంపైనే ఆశలు
ఆమదాలవలస, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస మునిసిపాలిటీలో ఆహ్లాదం కరువవుతోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకూ సాయంత్రం వేళ ప్రశాంతంగా సేదతీరేందుకు ఏర్పాటు చేసిన పార్క్‌లు గత పాలకుల తీరుతో నిర్లక్ష్యానికి గురయ్యాయి. మునిసిపాలిటీ పరిధిలోని బొడ్డేపల్లి రాజగోపాలరావు(బీఆర్) నగర్ కాలనీలో అమరావతి పార్క్ అధ్వానంగా దర్శనమిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఏడాదిపాట్లు ఎంతో ఆహ్లాదంగా ఉండేది. పట్టణ ప్రజలు సాయంత్రం వేళ ఇక్కడకు వచ్చి సేదతీరేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్క్ నిర్వహణను గాలికొదిలేశారు. వైసీపీ ప్రభుత్వం కానీ మునిసిపల్ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో పార్క్ అధ్వానంగా మారింది. ప్రస్తుతం ముళ్లపొదలు, పాముల పుట్టలతో దర్శనమిస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతితోపాటు ఆ పేరుతో ఉన్న ఏ ప్రాంత అభివృద్ధి అయినా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందని బీఆర్ నగర్ వాసులు ఆరోపిస్తున్నారు.
ఆమదాలవలస ప్రధాన రహదారి పాత మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న కోనేరు ప్రాంతంలో రామలింగేశ్వరస్వామి పేరుతో మున్సిపల్ అధికారులు ఒక పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్క్ కూడా నిర్లక్ష్యానికి గురై అధ్వాన స్థితికి చేరుకుంది.
మోనింగివారివీధిలో జవహర్‌లాల్‌నెహ్రూ పార్క్ కొద్ది రోజులు మాత్రమే పిల్లలకు అందుబాటులో ఉంది. తర్వాత మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ పార్క్‌పై పూర్తి నిర్లక్ష్యం వహించడంతో ఇక్కడ ఏర్పాటు చేసిన పరికరాలు కూడా మాయమయ్యాయి.
ఆమదాలవలసలో చిల్డ్రన్పార్క్తోపాటు స్కేటింగ్ ప్రాంగణం కూడా అధ్వాన స్థితికి చేరుకుంది. 28వ వార్డు వెంకయ్యపేటలో మున్సిపల్ పార్క్ కూడా రూపురేఖలు మారి సాధారణ చెరువగట్టుగా మారుతోంది. ఆమదాలవలస మునిసిపల్ నిధులతో ఏర్పాటు చేసిన నాలుగు పార్కులు నిరుపయోగంగా మారాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తపాలకవర్గమైనా.. పార్క్‌ల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.