అపరాలకు ‘మద్దతు’ ఏదీ?
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:03 AM
Millet crop అపరాల సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు దిగుబడి తగ్గగా.. మరోవైపు వ్యాపారుల మాయాజాలంతో ఎదురుదెబ్బ తగిలింది.
గిట్టుబాటు కాని ధర
వ్యాపారుల మాయాజాలం
కొనుగోలు కేంద్రాలు లేక అవస్థలు
నష్టపోతున్న రైతులు
నరసన్నపేట, జనవరి 29(ఆంధ్రజ్యోతి): అపరాల సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు దిగుబడి తగ్గగా.. మరోవైపు వ్యాపారుల మాయాజాలంతో ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది మినప, పెసర ధర క్వింటా రూ.8వేల వరకు పలికింది. దీంతో చాలామంది రైతులు ఈ అపరాల సాగుపై దృష్టి సారించారు. కానీ ప్రస్తుతం మద్దతు ధర లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సుమారు 15వేల హెక్టార్లలో మినుము, పెసర సాగు చేశారు. నరసన్నపేట, ఆమదాలవలస, టెక్కలి, హిరమండలం తదితర మండలాల్లో అధికంగా అపరాలు పండించారు. అపరాలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. మినప క్వింటాల్‌కు రూ.8,500, పెసరకు రూ.7,200 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారు. పెసర క్వింటాల్ రూ.6,500, మినప రూ.6,700 చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు గగ్గోలు చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి తగ్గిందని పేర్కొంటున్నారు. ఉన్న పంటకు మద్దతు లేక నష్టపోతున్నామని వాపోతున్నారు. పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.
అడ్డగోలుగా దోపిడీ
మార్కెట్‌లో మినుము, పెసలు కిలో రూ.100 నుంచి రూ.110కి విక్రయిస్తున్నారు. కానీ, రైతుల వద్ద మాత్రం రూ.67, రూ.68 చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు కంప్యూటర్ తూకాలతో ఒక్కో బస్తా (50 కేజీల) వద్ద 5 కేజీల వరకు అదనంగా తీసుకుంటున్నారు. మరోవైపు మినుముల్లో రాళ్లు, కొండ మినప ఉన్నాయంటూ ధరలో కోత విధిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. వ్యాపారులు దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇతర రాష్ర్టాలకు ఎగుమతి
జిల్లాలో అపరాల మార్కెట్‌కు నరసన్నపేట కేంద్రం. ఇక్కడ రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన అపరాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. పెసర, మినప సాగు దిగుబడిలో రాష్ట్రంలో మన జిల్లా మూడోస్థానంలో ఉంది. అయితే ఉత్తర రాష్ట్రాలకు సమీపంగా ఉండటంతో మన జిల్లాలో పండే పెసర, మినప పంటలను వ్యాపారులు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా నుంచి వ్యాపారులు రోజుకు సుమారు 10 లారీల్లో వేలాది టన్నుల అపరాలను తరలిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు ఎటువంటి పత్రాలు లేకుండానే అడ్డదారిలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇలా ఉంటే కష్టమే
రైతులకు ఆశించిన మేర ధర వస్తుందని భావించి అపరాలు సాగు చేశాం. తీరా పంట చేతికి వచేస సరికి అమాంతం ధర తగ్గించేశారు. వ్యాపారులు చెప్పిందే ధర. కనీసం పెట్టుబడులు కూడా రాకపోతే కష్టమే.
- పీస కృష్ణ, రైతు, చిన్నదూగాం