ఏకగ్రీవాలకు ప్రోత్సాహకమేదీ?
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:24 AM
Meager funds for panchayats జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవమైన కొన్ని పంచాయతీలకూ ఇప్పటికీ నిధులు అందలేదు. 2021 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలను అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వీలైనంత వరకూ ఏకగ్రీవాలు చేయాలని స్వయంగా అప్పటి సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఏకగ్రీవాలు చేస్తే.. నజరానాలు ఇస్తామని, ఆ నిధులతో రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. కానీ ఆచరణలో మాత్రం వెనుకడుగు వేశారు.
గత ఎన్నికల్లో పంచాయతీలకు అరకొరగా నిధులు
జిల్లాలో 66 చోట్ల జమకాని డబ్బులు
ప్రకటనలకే పరిమితం అని మాజీ సర్పంచ్‌ల ఆవేదన
ఈసారి భారీగా పారితోషికాన్ని పెంచిన కూటమి ప్రభుత్వం
టెక్కలి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి):
2021 స్థానిక ఎన్నికల్లో జలుమూరు మండలం అచ్యుతాపురం గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. కానీ ఐదేళ్ల వైసీపీ పాలనలో రూపాయి కూడా ప్రోత్సాహకం అందలేదు. అప్పట్లో భారీగా ప్రోత్సాహకాలు ఉంటాయని నమ్మించి ఏకగ్రీవాలు చేశారు. తీరా నిధుల విడుదల విషయంలో మాత్రం మొండిచేయి చూపారు.
జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవమైన కొన్ని పంచాయతీలకూ ఇప్పటికీ నిధులు అందలేదు. 2021 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలను అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వీలైనంత వరకూ ఏకగ్రీవాలు చేయాలని స్వయంగా అప్పటి సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఏకగ్రీవాలు చేస్తే.. నజరానాలు ఇస్తామని, ఆ నిధులతో రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. కానీ ఆచరణలో మాత్రం వెనుకడుగు వేశారు. జిల్లాలో గతంలో 910 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో 137 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కానీ చిన్న పంచాయతీలకు కొద్దిపాటి పారితోషికాలు అందించి మిగతా వాటిని నిర్లక్ష్యం చేశారు. 66 పంచాయతీలకు సంబంధించి రూ.3.60 కోట్ల మేరకు ప్రోత్సాహక నిధులు బకాయి ఉంది. దీనిపై అడిగితే.. అదిగో ఇదిగో అంటూ ఐదేళ్ల పాటు కాలయాపన చేసి చివరకు మొండిచేయి చూపారు. బకాయిల విషయమై జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి వద్ద ప్రస్తావించగా.. గతంలో అధికారులు ప్రతిపాదనలు పంపారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే ఆయా పంచాయతీల జనరల్ ఫండ్ ఖాతాలో జమచేస్తామన్నారు.
కూటమి రెట్టింపు ప్రోత్సాహకం
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవ పంచాయతీలకు సంబంధించి 2వేల లోపు జనాభా ఉంటే.. రూ.5లక్షలు ప్రోత్సాహకం అందజేస్తామని పంచాయతీరాజ్‌శాఖ ప్రకటించింది. 2వేల నుంచి 5వేల జనాభా ఉన్న ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షలు ఇస్తామని స్పష్టం చేసింది. 10 వేలపైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షలు అందిస్తామని ప్రకటించింది. కానీ ఎక్కడా పూర్తిస్థాయిలో అందివ్వలేదు. జిల్లాలో 137 ఏకగ్రీవ పంచాయతీలకుగానూ సుమారు రూ.4.60 కోట్ల నిధులు జమచేయాల్సి ఉండగా.. కేవలం రూ.కోటి మాత్రమే కొన్ని పంచాయతీలకు సర్దుబాటు చేసింది. చాలా పంచాయతీలకు నిధులు జమకాకపోవడంతో మాజీ సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు. నిధులు లేక అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని వాపోతున్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల వేళ.. భారీ ప్రోత్సాహకాలు అందజేయాలని నిర్ణయించింది. ఏకగ్రీవమైన పంచాయతీలో 5 వేల లోపు జనాభా ఉంటే రూ.15 లక్షలు, 5వేలు పైబడి 10 వేలలోపు జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10 వేల మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు చెల్లించనుంది. ఈ మేరకు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు కూడా జారీచేసింది.
జిల్లాలో ప్రస్తుతం 904 పంచాయతీలు ఉన్నాయి. ఈ నెల 26న, 29న, డిసెంబరు 2న.. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏకగ్రీవాల ప్రోత్సాహకాలు భారీగా పెరగడంతో గ్రామాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గ్రామ అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చాలా పంచాయతీల్లో ప్రజలు ఏకగ్రీవాలకు యత్నిస్తున్నారు. ఈసారి ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవమవుతాయో వేచిచూడాలి.