Share News

మా డబ్బులు ఇంకెప్పుడిస్తారు?

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:59 PM

Customers' concerns at the post office ఇచ్ఛాపురం పోస్టాఫీసు వద్ద సోమవారం ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తాము దాచుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మా డబ్బులు ఇంకెప్పుడిస్తారు?
పోస్టల్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఖాతాదారులు

  • పోస్టల్‌ బాధితుల కన్నెర్ర

  • ఇచ్ఛాపురంలో కార్యాలయం వద్ద ఆందోళన

  • న్యాయం చేయాలని డిమాండ్‌

  • ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం పోస్టాఫీసు వద్ద సోమవారం ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తాము దాచుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత ఏడాది జూలైలో పోస్టల్‌ శాఖలో భారీ అవినీతి వెలుగుచూసింది. 33మంది ఖాతాదారులకు సంబంధించిన కిసాన్‌ వికాస్‌పత్రాల బాండ్లు నగదు రూ.2.86 కోట్లు గల్లంతయ్యాయి. సైబర్‌ నేరస్థులతో కలిసి కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై అప్పట్లో పోస్టల్‌ ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. మరో 9 మందిని అనుమానితులుగా చేర్చారు. అయితే దాదాపు ఏడు నెలలు గడిచినా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ఏం జరిగిందన్నది తేలలేదు.

  • అప్పట్లో బాధితులు ఆందోళన చేయగా.. ప్రతి బాధిత ఖాతాదారుడికి పరిహారంతో సహా డబ్బులు చెల్లిస్తామని పోస్టల్‌ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 33 మందిలో 20 మందినే పిలిచి చెక్కులు ఇచ్చారు. అప్పట్లో చెప్పినట్టుగా కాకుండా నగదులో కోత విధించారు. దీంతో వారు చెక్కులను తీసుకునేందుకు ఒప్పుకోలేదు. బాధిత ఖాతాదారులంతా సోమవారం కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సిబ్బంది తాళాలు తీయకుండా అడ్డుకున్నారు. తాము దాచుకున్న డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారంటూ సిబ్బందిని నిలదీశారు. దీంతో గందరగోళం పరిస్థితి నెలకొనగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఖాతాదారులను స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారితో సీఐ చిన్నంనాయుడు చర్చలు జరిపారు. పోస్టల్‌ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రతిఒక్క బాధితుడికి పూర్తిస్థాయిలో నగదు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు శాంతించారు. బాధితులకు అండగా ఉంటానని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ దాసరి రాజు భరోసా ఇచ్చారు.

  • న్యాయం చేయండి

  • నా వయస్సు 92 ఏళ్లు. ఇచ్ఛాపురం సబ్‌పోస్టాఫీసులో 15 కిందట పొదుపుఖాతా తెరిచి రూ.77వేలు దాచుకున్నాను. మూడేళ్ల కిందట బాండ్లు మెచ్యూరిటీ అయ్యాయి. కానీ నా పిల్లలు సుదూర ప్రాంతాల్లో ఉండడంతో డబ్బులు తీసుకోలేకపోయాను. పోస్టాఫీస్‌లో భద్రంగా ఉంటాయని భావించాను. ఐదు నెలల కిందట పోస్టాఫీస్‌కు వెళ్లగా ఖాతా రద్దయిందని, టెక్కలి వెళ్లి పునరుద్ధరించుకోవాలని సిబ్బంది చెప్పారు. టెక్కలి ప్రధాన కార్యాలయంలో అన్ని రకాల ధ్రువపత్రాలు సమర్పించినా.. ఇంతవరకూ నేను దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదు. పోస్టల్‌ ఉన్నతాధికారులు స్పందించి నా డబ్బులు అందించేలా న్యాయం చేయాలి.

  • - కమల మహాపాత్రో, కొళిగాం, ఇచ్ఛాపురం

  • కాలయాపన చేస్తున్నారు

  • పోస్టల్‌లో మా పిల్లల చదువుకోసం రూ.10 లక్షలు డిపాజిట్‌ చేశాను. మెచ్యురిటీ గడువు పూర్తయినా.. ఇంతవరకు మాకు డబ్బులు రాలేదు. మా డబ్బులు ఎప్పుడిస్తారో తెలియడం లేదు. అధికారులు అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. బాధిత ఖాతాదారులందరికీ దాచుకున్న డబ్బులు ఇవ్వాల్సిందే.

    - చాట్ల లోహిదాస్‌రెడ్డి, ఇచ్ఛాపురం

Updated Date - Feb 02 , 2026 | 11:59 PM