‘దారి’కొచ్చేదెప్పుడో?
ABN , Publish Date - May 07 , 2026 | 12:19 AM
ముకుందపురం-కేరాశింగి-గూడ రోడ్డుకు మోక్షం కలగడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోడ్డు పనులు పూర్తికావడం లేదు. ఏదో ఒక రూపంలో ఆటంకం కలుగుతుంది.
- సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికాని ముకుందపురం-కేరాశింగి-గూడ రోడ్డు
- వైసీపీ సర్కారులో పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపు
- కూటమి ప్రభుత్వంలో కొంత మేర నిర్మాణం
- బిల్లులు చెల్లించకపోవడంతో మళ్లీ ఆగిన పనులు
మెళియాపుట్టి, మే 6(ఆంధ్రజ్యోతి): ముకుందపురం-కేరాశింగి-గూడ రోడ్డుకు మోక్షం కలగడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోడ్డు పనులు పూర్తికావడం లేదు. ఏదో ఒక రూపంలో ఆటంకం కలుగుతుంది. ప్రతి ఏడాది నిధులు మంజూరు చేస్తున్నా పనులు మాత్రం పూర్తి కావడం లేదు. దీంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. కొండ దిగువన ఉన్న ముకుందపురంనుంచి కొండ ఎగువన ఉన్న కేరాశింగి, గూడ వరకు ఆరు కిలోమీటర్ల రహదారి పనులు ప్రారంభించారు. కొంత వరకు మట్టి పనులు జరిగాయి. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో పనులు చేయకుండా బిల్లులు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గిరిజనుల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొంత వరకు పనులు జరిగాయి. అయితే, బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలో వదిలేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మెటల్‌తో పాటు రాయిపిండి (క్రషర్ బుగ్గి) కొట్టుకుపోవడంతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. దీంతో పనులు మళ్లీ మొదటికి వచ్చాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి కూటమి సర్కారు వరకు ఈ రోడ్డు కోసం రూ.3.95కోట్లు ఖర్చు చేశారు. అయినా పనులు మాత్రం పూర్తి కావడం లేదు. ప్రస్తుతం ఈ మార్గంలో పెద్దపెద్ద రాళ్లు తేలి ఉన్నాయి. కొంతమంది ఆటో డ్రైవర్లు ధైర్యం చేసి ప్రయాణికులను కొండ పైకి తీసుకెళ్తున్నారు. దిగేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోయలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా పనులు పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయమై ఐటీడీఏ డీఈ రాజును వివరణ కోరగా.. ‘రోడ్డు పనులు చేసిన కొంత మంది కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కాలేదు. దీనివల్ల పనులు చేయడానికి వారు ముందుకు రావడం లేదు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తారు రేట్లు పెరిగాయి. దీనివల్ల పనులు చేసేందుకు కొత్త కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.’ అని తెలిపారు.