ఆలయ కమిటీలు ఇంకెప్పుడు?
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:03 AM
టెక్కలిలో ప్రధాన దేవాలయాలకు కమిటీలు లేవు. రెండేళ్లుగా కమిటీలు లేకపోవడంతో ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.
- నియామకాల్లో తీవ్ర జాప్యం
- రెండేళ్లుగా తప్పని నిరీక్షణ
టెక్కలి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): టెక్కలిలో ప్రధాన దేవాలయాలకు కమిటీలు లేవు. రెండేళ్లుగా కమిటీలు లేకపోవడంతో ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. రావివలస ఎండలమల్లికార్జునస్వామి, టెక్కలిలోని లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మణబాలాజీ, గోపాలజగన్నాథ, సంతోషిమాత, శ్యామసుందరస్వామి తదితర ఆలయాలకు కమిటీల నియామకం జరగలేదు. ఎండలమల్లన్న ఆలయానికి ఉప ఆలయాలు, గాలిగోపురం, నవగ్రహ మండపం, భోగశాల, సీత పుష్కరిణి, ధ్వజస్తంభం మరమ్మతులు, పక్కా క్యూలైన్ల ఏర్పాటు, పురోహితుల క్వార్టర్స్, కార్యాలయం వంటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం రూ.2కోట్లతో ప్రధాన రహదారి పనులు పూర్తి చేశారు. మరో రూ.3కోట్ల సీజీఎఫ్ నిధులతో ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి సుమారు రూ.6కోట్లు అవసరముంటుందని అధికారులు భావిస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పలు సమస్యలు ఉన్నాయి. బేడామండపం శిథిలమైంది. గోపాలజగన్నాథ, లక్ష్మణబాలాజీ ఆలయాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవచూపి కమిటీల నియామకాలు చేపడితే ఆలయాలు అభివృద్ధి జరుగుతాయని పలువురు భావిస్తున్నారు. దీనిపై ఈవో జి.గురునాథరావును వివరణ కోరగా.. ‘ఎండలమల్లన్న ఆలయ కమిటీ ఏడాది కిందట రద్దయింది. 40మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకే కమిటీల నియామకాలు జరుగుతాయి.’ అని తెలిపారు.