ఆలయ కమిటీల నియామకమెప్పుడో?
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:59 PM
జిల్లాలోని పలు ప్రధాన దేవాలయాలకు కమిటీలు లేవు. ఉత్సవాల సమయంలో సంబంధిత ఉత్సవ కమిటీలతోనే కాలయాపన చేస్తున్నారు.
- చొరవ చూపని ప్రజాప్రతినిధులు
- జిల్లాలో 795 ఆలయాలు
టెక్కలి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రధాన దేవాలయాలకు కమిటీలు లేవు. ఉత్సవాల సమయంలో సంబంధిత ఉత్సవ కమిటీలతోనే కాలయాపన చేస్తున్నారు. ఆలయ కమిటీల నియామకాలు మాత్రం చేపట్టడం లేదు. జిల్లాలో 6ఏ పరిధిలో అరసవల్లి సూర్యనారాయణస్వామి, శ్రీకూర్మం కూర్మనాథస్వామి, శ్రీముఖలింగంలోని మొఖలింగేశ్వర, పాతపట్నంలోని నీలమణిదుర్గా, కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి, రావివలస ఎండలమల్లికార్జునస్వామి ఆలయాలు ఉన్నాయి. 6బీ పరిధిలో 16 ఆలయాలు, 6సీ పరిధిలో 758, 6డీ పరిధిలో 16 మొత్తంగా 795 ఆలయాలు ఉన్నాయి. అయితే చాలా ఆలయాలు పర్సన్ ఇన్ మేనేజ్‌మెంట్ ద్వారా అర్చకుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈవోలతో పాటు సిబ్బంది కొరత వేధిస్తోంది. మరోవైపు పలు దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. ఆలయాల అభివృద్ధి కూడా అంతంత మాత్రానికే పరిమితమైంది. ఇప్పటికీ జిల్లాలో కొన్నిచోట్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఆలయ కమిటీల పెద్దరికమే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఆలయ కమిటీల నియామకాలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అరసవల్లి, శ్రీముఖలింగం, రావివలస వంటి ప్రధాన ఆలయాలకు కమిటీలను నియమించాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై దేవదాయశాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్‌ను వివరణ కోరగా.. ‘ఇప్పటికే అరసవల్లి, శ్రీముఖలింగం ఆలయాలకు కమిటీల నియామకానికి నోటిఫికేషన్ జారీచేశాం. త్వరలో నియామకం చేపడతాం. మిగిలిన ఆలయాలకు కూడా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు కమిటీల నియామకాలు జరుగుతాయి.’ అని తెలిపారు.