కొత్త పింఛన్లు ఎప్పుడో?
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:12 AM
No pensions.. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
జిల్లాలో 12వేల మందికిపైగా ఎదురుచూపు
ఆన్‌లైన్‌లో నమోదుకు కానరాని ఆప్షన్
ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేక సచివాలయాల్లో దరఖాస్తుల నిరాకరణ
ఎమ్మెల్యేలకు కుప్పలుతెప్పలుగా వినతులు
ఎప్పటికి ఆమోదం పొందుతాయో తెలియని దుస్థితి
శ్రీకాకుళం/ మెళియాపుట్టి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం గ్రామానికి చెందిన లక్ష్మీపాత్రో భర్త రెండేళ్ల కిందట ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆమె వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇంతవరకూ మంజూరు కాలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. సెంటు భూమి కూడా లేదని, కుటుంబ పోషణ భారమవుతోందని ఆమె వాపోతోంది. అధికారులు స్పందించి కొత్త పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటోంది.
మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం గ్రామానికి చెందిన కోటిలింగాల ఆనంద్‌కుమార్‌కు పుట్టినప్పటి నుంచీ రెండు కళ్లు కనిపించవు. గతంలో దివ్యాంగ పింఛన్ వచ్చేది. కానీ కొన్నాళ్ల కిందట తన కుటుంబానికి కారు ఉన్నట్టు ఆన్‌లైన్‌లో చూపించడంతో పింఛన్ నిలిపేశారు. తనకు పింఛనే ఆధారమని, దానిని పునరుద్ధరించాలని కలెక్టరేట్ చుటూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
మెళియాపుట్టి మండలం మామిడిగుడ్డి గ్రామానికి చెందిన సవర రాజ్‌కూమార్‌కి పుట్టుకతోనే మూగ, చెవుడు. సాంకేతిక సమస్యల కారణంగా రాజ్‌కుమార్‌కి దివ్యాంగ పింఛన్ నిలిచిపోయింది. గతంలో ఈయన కుటుంబంలో ముగ్గురికి పింఛన్ వచ్చేది. రాజ్‌కుమార్ నాన్న కొన్నాళ కిందట మృతి చెందాడు. చెల్లికి వివాహమై అత్తారింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం రేషన్‌కార్డులో రాజ్‌కుమార్ ఒక్కడే ఉన్నా.. పింఛన్ రాక ఇబ్బందులు పడుతున్నాడు.
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది పింఛన్లకు కోత పెట్టి, లబ్ధిదారులను క్షోభకు గురిచేశారు. కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించేలా సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచింది. ప్రతినెలా వృద్ధులు, వితంతువులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 15వేలు చొప్పున అందజేస్తోంది. దీంతో ఆయా లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కొత్త పింఛన్ల మంజూరు కోసం జిల్లాలో వేలాదిమంది అర్హులైన పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వయోపరిమితి తగ్గిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండగా.. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. దీంతో దరఖాస్తుదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
జిల్లాలో 12 వేల మందికి పైగా..
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 3,06,784 మందికి ప్రభుత్వం ప్రతినెలా ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తోంది. కొత్త పింఛన్ల కోసం మరో 12వేల మందికిపైగా పేదలు ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛను మంజూరు చేస్తామని ఇచ్చిన హామీతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు సిద్ధంగా లేరు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలు కానీ, ఆదేశాలు కానీ రాలేదని చెబుతున్నారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా దరఖాస్తు చేసుకునే ఆప్షన్‌ను ఇంకా ఎనేబుల్ చేయలేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో అర్హత ఉండి, పత్రాలు పట్టుకుని సచివాలయాలకు వెళ్తున్న వృద్ధులు, దివ్యాంగులకు నిరాశే మిగులుతోంది. కనీసం దరఖాస్తులు తీసుకుంటే, ప్రభుత్వ ఆదేశాలు రాగానే పరిశీలిస్తారన్న భరోసా కూడా లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. సదరం సర్టిఫికెట్లు ఉన్న దివ్యాంగులు సైతం పింఛన్ల దరఖాస్తుకు ఎప్పటికి ఆమోదం పొందుతుందోనని నెలల తరబడి వేచి చూస్తున్నారు.
ప్రజాప్రతినిధులకు తప్పని తాకిడి...
సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకోకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(మీకోసం- గ్రీవెన్స్) కు ప్రతి సోమవారం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు. మరోవైపు, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు వెంటనే పోర్టల్ తెరిచి, మార్గదర్శకాలు విడుదల చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై నేతలు స్పందిస్తూ ప్రభుత్వం నుంచి విధానపరమైన నిర్ణయం వెలువడగానే అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని చెబుతున్నారు.
‘ఆప్షన్’ రాలేదు
ప్రస్తుతం కొత్త పింఛన్ల నమోదు కోసం ఆన్‌లైన్‌లో ఆప్షన్ రాలేదు. దరఖాస్తులను తీసుకుని భద్రం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తాం.
- ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి