Share News

జంతిబందకు మోక్షమెప్పుడో?

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:14 PM

ఉద్దాన ప్రాంత ప్రజల ఏకైక సాగునీటి వనరు జంతిబంద.

జంతిబందకు మోక్షమెప్పుడో?
జంతిబంద రిజర్వాయర్‌ నిర్మించాల్సిన ప్రదేశం

- ప్రతిపాదనలకే పరిమితమైన రిజర్వాయర్‌ నిర్మాణం

- ఎన్నో సంవత్సరాలుగా ఇదే పరిస్థితి

- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

సముద్రంలో కలుస్తున్న నీరు- 5 టీఎంసీలు(అధికారుల అంచనా)

రిజర్వాయర్‌తో సాగులోకి వచ్చే భూములు- 25 వేల ఎకరాలు

తాగునీటి వసతి- 220 గ్రామాలకు

నిర్మాణ వ్యయం- రూ.4 కోట్లు

హరిపురం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఉద్దాన ప్రాంత ప్రజల ఏకైక సాగునీటి వనరు జంతిబంద. సముద్ర పాద భాగానికి ఆనుకొని ఉన్న కొండల ప్రాంతం నుంచి వృథాగాపోతున్న నీటిని ఒడిసి పట్టుకుంటే.. దశాబ్దాల ప్రజల ఆకాంక్ష ఫలించి.. ఉద్దానం ఉద్యానవనంగా మారనుంది. జంతిబందను రిజర్వాయర్‌గా మలిచేందుకు ఆరు దశాబ్దాలుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు గాలిలో కలిసిపోయాయి. కేవలం ప్రతిపాదనలే మిగిలాయి. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని గత నాయకులు హామీ ఇచ్చి విస్మరించగా.. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా జంతిబందపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. జంతిబందను సుమారు రూ.4కోట్ల వ్యయంతో రిజర్వాయర్‌గా మారిస్తే మందస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో సుమారు 25 వేల ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందనుంది. నాలుగు మండలాల పరిధిలో సుమారు 220 గ్రామాలకు తాగునీటి కొరత తీరనుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక నీటి పారుదల శాఖ అధికారులతో సర్వే చేసి రూ.1.85 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. టెండర్లను పిలిచినా ధరలు పెరగడంతో నిధులు ఏమాత్రం సరిపోవని కాంట్రాక్టర్లు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం కొత్త ధరలతో నిర్మాణ వ్యయం పెరిగింది. కనీసం రూ. 4కోట్లు వ్యయం అవుతుందని సంబంధిత అధికారుల అంచనా. కూటమి ప్రభుత్వమైనా స్పందించి జంతిబందను రిజర్వాయర్‌గా మార్చాలని ఉద్దాన ప్రాంత రైతులు కోరుతున్నారు.

రిజర్వాయర్‌తోనే సస్యశ్యామలం

ఉద్దాన ప్రజల చిరకాల వాంఛ ఇది. రాజకీయాలకు అతీతంగా కృషిచేసి రిజర్వాయర్‌గా మారిస్తే ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీటి అవసరాలు తీరుతాయి. ఎడారిగా ఉన్న ఈ భూములు సస్యశ్యామలంగా మారి రైతులకు ఎంతో దోహదపడుతుంది. ఉన్న కొబ్బరి తోటలు సైతం నీటి సమస్యతో కాయలు రాని దుస్థితి నెలకొంది. రిజర్వాయర్‌ నిర్మాణం జరిగితే ఉద్దానంలో నీటి కొరత తీరుతుంది.

-సాలిన మాధవరావు, రైతు ప్రతినిధి, బహాడపల్లి 12హెచ్‌పీఎం02

నిర్మించాలి..

గత ప్రభుత్వాలు రిజర్వాయర్‌ నిర్మాణంలో వివక్ష చూపించాయి. రైతుల కోసం ఈ ప్రాంతంలో ఒక్క పని కూడా చేపట్టలేదు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం రిజర్వాయరు నిర్మాణాన్ని చేపట్టి ప్రజల కోరకను నెరవేర్చాలి. సర్దార్‌ గౌతు లచ్చన్న పేరుతో రిజర్వాయర్‌ను ప్రారంభించాలి.

-కారి ఈశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, బేతాళపురం..12హెచ్‌పీఎం03

ప్రతిపాదనలతో నిలిచింది..

ఇప్పటికే రెండుసార్లు జలవనరుల శాఖ అధికారుల సర్వే చేసి ప్రతిపాదనలు చేశారు. అంతలోనే ఈ ప్రక్రియ టెండర్లు దశలోనే మూలనపడింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా కృషిచేస్తాం.. ప్రస్తుత ధరలతో మళ్లీ నివేదికలు తయారు చేసి టెండర్లు పిలిస్తే సమస్య పరిష్కారమవుతుంది.

-ఎంశ్రీనివాసరావు, ఏఈఈ, జలవనరుల శాఖ మందస

Updated Date - Apr 12 , 2026 | 11:14 PM