Share News

‘నగర వనం’ పూర్తయ్యేదెప్పుడు?

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:24 AM

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు కూతవేటు దూరంలో ‘నగర వనం’ పేరిట పర్యాటక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.

 ‘నగర వనం’ పూర్తయ్యేదెప్పుడు?
కోసంగిపురం రోడ్‌కు సమీపంలో ఉన్న నగర వనం

-రెండో విడత మంజూరు కాని నిధులు

- ఆరు నెలలుగా నిలిచిన పనులు

- క్షేత్రస్థాయిలో కానరాని పర్యవేక్షణ

కాశీబుగ్గ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు కూతవేటు దూరంలో ‘నగర వనం’ పేరిట పర్యాటక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. అయితే పనులు నత్తనడకన జరుగుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకరంగ అభివృద్ధికి పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలకు దగ్గర్లో ఉండే అటవీ భూముల్లో నగర వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు సమీపంలో ఉన్న 125 ఎకరాల అటవీ మెండు భూముల్లో 2024 డిసెంబరులో నగర వనం పనులు ప్రారంభించారు. వీటి కోసం రూ.2 కోట్లు మంజూరు చేశారు. తొలివిడతగా రూ.1.40 కోట్లు విడుదలయ్యాయి. దీంతో చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా చిల్డ్రన్స్‌ పార్కు, అడ్వెంచర్‌ పార్కు, ట్రేకింగ్‌ ట్రాక్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, ట్యాంకులు, యోగా సెంటర్‌, పర్ణశాల, అన్ని వంటకాలను అందించే రెస్టారెంట్‌, పర్యాటకులను ఆకట్టుకునే వీలుగా భారీ జంతు బొమ్మల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అయితే, రెండో విడత నిధులు రూ.60లక్షలు విడుదలకాకపోవడంతో ఈ పనులన్నీ గత ఆరు నెలలుగా నిలిచిపోయాయి. మరోవైపు ఈ పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హైవే చెంతనే..

జాతీయ రహదారి చెంతనే కోసంగిపురానికి కూతవేటు దూరంలో ఈ నగరవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 650 ఎకరాల్లో మెండు ఫారెస్టు ఏరియా విస్తరించి ఉంది. ఇటు పలాస, అటు మందస, మరోవైపు మెళియాపుట్టి మండలాల వరకూ విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం అరుదైన జంతువులు, పశుపక్ష్యాదులకు ఆవాసంగా ఉంది. జీడి చెట్లు అధికంగా ఉన్నాయి. జాతీయ రహదారి చెంతనే ఉండే 125 ఎకరాల్లో నగరవనం ఏర్పాటు చేసి, తద్వారా మెండు అటవీ ప్రాంతాన్ని రక్షించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. మరోవైపు అటవీ ఉత్పత్తుల క్రయ విక్రయాలు కూడా ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ, పనుల తీరు చూస్తుంటే కనీసం పూర్తయ్యేందుకు ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నగర వనం పూర్తయితే సీతంపేటలోని ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు మాదిరిగా గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఒక్కపలాస నియోజకవర్గమే కాదు.. ఇచ్ఛాపురం, పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాల ప్రజలకు సైతం ఈ పర్యాటక ప్రాంతం అందుబాటులో ఉంటుంది. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

పనులు పూర్తిచేస్తాం

నగరవనం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. తొలివిడతగా రూ.1.40 కోట్లు విడుదల చేసింది. రెండో విడతగా రూ.60లక్షలు రావాల్సి ఉంది. పనులు ఆగకూడదని నా సొంత నిధులు రూ.20లక్షలతో పనులు జరిపించాను. మిగతా నిధులతో సైతం అన్ని హంగులు కల్పిస్తాం. కొద్ది నెలల్లో ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటున్నాం. నిధులు మంజూరైతే పనులు పూర్తి చేస్తాం.

- మురళీకృష్ణ నాయుడు, అటవీశాఖ అధికారి, పలాస

Updated Date - Jun 04 , 2026 | 12:24 AM