Share News

అదనపు గదుల నిర్మాణమెప్పుడో?

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:19 PM

మండలంలోని అక్కుపల్లి మత్స్యకార గురుకుల పాఠశాల(బాలురు)లో విద్యార్థులకు సరిపడ గదులు లేవు. నిధుల కొరత కారణంగా అదనపు గదులు నిర్మాణానికి నోచుకోవడం లేదు.

 అదనపు గదుల నిర్మాణమెప్పుడో?
అక్కుపల్లిలో ఉన్న బీసీ గురుకుల పాఠశాల

- నిధుల కొరతతో జరగని పనులు

- విద్యార్థులకు తప్పని కష్టాలు

- ఇదీ అక్కుపల్లి గురుకుల పాఠశాలలో పరిస్థితి

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అక్కుపల్లి మత్స్యకార గురుకుల పాఠశాల(బాలురు)లో విద్యార్థులకు సరిపడ గదులు లేవు. నిధుల కొరత కారణంగా అదనపు గదులు నిర్మాణానికి నోచుకోవడం లేదు. దీంతో రెండు సెక్షన్‌లతో నడవాల్సిన పాఠశాల సింగిల్‌ సెక్షన్‌కే పరిమితమైంది. వాస్తవానికి 480 మంది పేద విద్యా ర్థులు చదవుకునే వీలున్నప్పటికీ కేవలం 150 మందితోనే పాఠశాలను కొనసాగిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్కుపల్లిలో మత్స్య కార గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. తాత్కాలిక తరగతులను ఖాళీగా ఉన్న అక్కుపల్లి ఎస్సీ హాస్టల్‌ భవనంలో ప్రారంభించారు. అయితే వసతి, తరగతులకు గదులు చాలకపోవడంతో పక్కనే ఉన్న తుఫాన్‌ రక్షిత భవనాన్ని కూడా ఉపయోగించుకోవల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరింది. స్లాబ్‌పెచ్చులూడి పడు తుండడం.. గదుల సమస్య కారణంగా ఒకపూట మాత్రమే పాఠశాలను నడుపుతున్నారు. ఈ పాఠశాల శాశ్వత భవనాల నిర్మాణం కోసం మం డలంలోని బెండికొండవద్ద 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే, నిధుల సమస్య వలన భవనాల నిర్మాణం జరగడం లేదు. తీరప్రాంత వాసులకు ఎంతో ఉపయోగపడే మత్స్యకార బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనాల కోసం జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, దీనివల్ల మరింతమంది మత్స్యకార విద్యార్థులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇక్కడ చదువుకొనే వీలుంటుందని స్థానికులు పేర్కొంటు న్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గదులు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:19 PM