ఏఎంసీలు బాగుపడేదెప్పుడు?
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:22 AM
జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు(ఏఎంసీ) నిస్తేజంగా మారాయి.
-నిస్తేజంగా మార్కెట్ కమిటీలు
-వృఽథాగా పడిఉన్న గోదాంలు, కళ్లాలు
- రైతులకు సక్రమంగా అందని సేవలు
నరసన్నపేట, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు(ఏఎంసీ) నిస్తేజంగా మారాయి. రైతులకు సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఏఎంసీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గత వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు దయనీయ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వాటిద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బాగుపడతాయని అంతా భావించారు. అయితే రెండేళ్లు అవుతున్నా వాటి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. రైతు బంధు పథకం పక్కాగా అమలు చేయడం లేదు. పలు గోదాములు, కళ్లాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిధుల కేటాయింపు లేకపోవడంతో రైతులకు సక్రమంగా సేవలు అందడం లేదు. కొన్నిచోట్ల గోదాంలు ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో నరసన్నపేట, శ్రీకాకుళం, పొందూరు, జలుమూరు, ఆమదాలవలస, కోటబొమ్మాళి, పాతపట్నం, కంచిలి, పలాస, పాతపట్నం, హిరమండలం, ఎచ్చెర్లలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో మార్కెట్ కమిటీలో 3వేల మెట్రిక్ టన్నుల ధాన్యం భద్రపరిచేందుకు వీలుగా గోదాములు ఉన్నాయి. అలాగే రైతులు ధాన్యం ఆరబెట్టేందుకుగానూ రెండు, మూడేసి చొప్పున పెద్దపెద్ద కళ్లాలు నిర్మించారు. అయితే, కోట్లాది రూపాయలతో నిర్మించిన గిడ్డంగులు వృథాగా పడిఉన్నాయి. గత ఆరు సంవత్సరాలుగా గోదాములు, కళ్లాలను వినియోగించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి. దీంతో ఈఏడాది తుఫాన్ల సమయంలో రైతులు పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. కొన్నిచోట్ల పంట తడిసిపోవడంతో నష్టపోయారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు అవుతున్నా ఇంకా మార్కెట్ కమిటీలు బాగుపడలేదు. ఏఎంసీ సిబ్బంది కేవలం మార్కెట్ సెస్ మీద మాత్రమే దృష్టి సారిస్తున్నారు. నరసన్నపేట మండలంలో మడపాం కేంద్రం వద్ద వాహనాలను తనిఖీ చేసి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా టమాట, చెరుకు, అరటి, కూరగాయలు, పశువులు రవాణా చేసే వాహనాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొన్ని గోదాములను ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చి సిబ్బంది చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రి సమయాల్లో ఏఎంసీ కార్యాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. పశువులు, గొర్రెల పెంపకం దారులు వీటిని ఆవాసులుగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా.. రైతులు పండించిన పంటలను మార్కెట్ కమిటీలోని గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నిల్వ చేసిన పంటలపై మార్కెట్ కమిటీలు రైతులకు 60 శాతం వరకూ నామమాత్రపు వడ్డీతో రుణాలు అందజేసేవారు. మార్కెట్‌లో మద్దతు ధర ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు ఆ పంటను విక్రయించుకుని.. రుణాలు తీర్చేవారు. అలాగే మార్కెట్ కమిటీ పరిధిలో వైద్య, పశు వైద్యశిబిరాలు కూడా నిర్వహించేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పథకాన్ని నిలిపేశారు. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. రైతు బంధు పథకాన్ని మళ్లీ అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో కొన్ని మార్కెట్ కమిటీ కార్యాలయాలు రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. నరసన్నపేట మార్కెట్ యార్డులో రాత్రివేళ గంజాయి బ్యాచ్, మందుబాబులు ఇక్కడ మకాం వేస్తున్నారు. ఇదే ప్రాంతంలో వేరే హౌసింగ్ గోదాములు ఉన్నాయి. మందుబాబుల కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే రూ.కోట్లలో నష్టం జరిగే అవకాశం ఉంది.
వినియోగంలోకి తీసుకురావాలి
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న రైతుబంధు వంటి పథకాలను మళ్లీ అమలు చేయాలి. విపత్తు సమయంలో రైతులు పండించే పంటలను నిల్వ చేసుకునేందుకు, ఆరబెట్టుకునేందుకు వీలుగా గోదాములు, ప్లాట్‌ఫాంలను వినియోగంలో తీసుకురావాలి.
- పీస కృష్ణ, రైతు, చిన్నదూగాం
చర్యలు చేపడుతున్నాం
జిల్లాలోని 12 మార్కెట్ కమిటీలు రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని ఏఎంసీలు నాన్ కమర్షియల్ కేటగిరీకి చెందనవి. వీటిని గతంలో కంటే బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తగు మార్గదర్శకాలను జారీ చేశారు.
- బి.రవికిరణ్, ఏడీ, మార్కెట్ కమిటీ