కల సాకారమైన వేళ
ABN , Publish Date - May 31 , 2026 | 11:57 PM
ఉద్దానం ప్రజల చిరకాల వాంఛ నెరవేరే సమయం ఆసన్నమైంది. కొత్త రైల్వేజోన్ కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి.
- నేటి నుంచి సౌత్‌కోస్టు రైల్వేజోన్‌లోకి ఉద్దానం రైల్వేస్టేషన్లు
- డివిజన్ సైతం ఆ జోన్‌లోనే
- ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఉద్యోగులు
పలాస, మే 31 (ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రజల చిరకాల వాంఛ నెరవేరే సమయం ఆసన్నమైంది. కొత్త రైల్వేజోన్ కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. దీంతో ఇచ్ఛాపురం, జాడుపూడి, సోంపేటరోడ్, బారువ, మందసరోడ్, పలాస రైల్వేస్టేషన్లీ విశాఖజోన్ పరిధిలోకి రానున్నాయి. ఈ జోన్ నుంచే ఉద్యోగులంతా పనిచేయనున్నారు. ఇప్పటికే ఒడిశా వెళ్లే ఉద్యోగులకు బదిలీలు జరగ్గా, మిగిలి ఉన్న సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించడానికి సౌత్‌కోస్ట్ రైల్వేశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆరు నెలల పాటు విధులు నిర్వహించిన తరువాత శాఖాపరంగా కావాల్సిన ఉద్యోగుల భర్తీ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల్లో సందడి నెలకొంది. తమకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే(భువనేశ్వర్), ఖుర్ధారైల్వేడివిజన్ నుంచి విముక్తి ప్రసాదించాలని ఉద్దానం గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైల్వే సిబ్బంది ఎన్ని విన్నపాలు చేసినా గత ప్రభుత్వాలు ఏవీ పట్టించుకున్న పాపాన లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేంద్ర మంత్రిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవ తీసుకొని ఈ ప్రాంతం రైల్వేపరంగా వెనుకబాటుతనాన్ని రైల్వేమంత్రిత్వశాఖ, కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఎప్పటి నుంచో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు డిమాండ్ ఉంది. మొత్తం అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని విశాఖ రైల్వేజోన్‌తో పాటు పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వేస్టేషన్లన్నీ విశాఖ డివిజన్ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు జీవో విడుదల చేశారు. దీంతో ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులకు ఉన్న సందేహాలన్నీ నివృత్తయ్యాయి. అయితే, పలాస వరకూ ఖుర్ధారోడ్ డివిజన్‌లోనే ఉంటుందని నెల రోజుల కిందట సంకేతాలు అందాయి. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మరోమారు రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ దృష్టికి సమస్య తీసుకువెళ్లి పరిష్కరించారు. అనంతరం రైల్వేశాఖ.. తెలుగు రైల్వేస్టేషన్లన్నీ విశాఖ జోన్, డివిజన్‌లోను ఉంటాయని ప్రకటన ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రకటించిన విధంగానే సోమవారం నుంచి కొత్త రైల్వేజోన్‌లో కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. విశాఖజోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డివిజన్లు ఉంటాయి. ఇందులో 385 రైల్వేస్టేషన్లు ఉండగా, 62వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. అమృతభారత్ రైల్వేస్టేషన్లగా పలాస, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం ఇప్పటికే ప్రకటించి అభివృద్ధి చేస్తున్నారు. పలాస, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లలో అభివృద్ధి నత్తనడకన సాగుతోంది. జోన్‌మార్పిడితో అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశం ఉంది.
మాది చేతల ప్రభుత్వం
మాది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపితమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వేజోన్ మార్పిడి, అందులో పలాస, ఇచ్ఛాపురం నియోజవర్గాలు ఉండాలని రైల్వేశాఖమంత్రితో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలసి మాట్లాడడం జరిగింది. అనేకమార్లు ఢిల్లీ వెళ్లి ఈ సమస్య కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ఫలితమిది. ఉద్దానం ప్రాంతంలో ఉన్న అన్నీ రైల్వేస్టేషన్లు సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. కొత్త రైల్వేజోన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా అన్నీవర్గాల ప్రజలు, ఉద్యోగులకు శుభాకాంక్షలు.
-గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస
ఒకే రాష్ట్రం..ఒకే జోన్
ఒకేరాష్ట్రం, ఒకే రైల్వేజోన్‌గా రూపొందడం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎన్నోఏళ్ల నుంచి ప్రజలు పోరాటాలు చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రమంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైల్వేజోన్‌తో పాటు పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ రైల్వే స్టేషన్లు అందులోనే కలపడంతో ఈ ప్రాంత ప్రజలకు వినియోగపడుతుంది.
-ఎం.నరేంద్ర(చిన్ని), సీనియర్ టీడీపీ నాయకుడు, కాశీబుగ్గ