Share News

‘వంశధార’ ఎప్పుడు?

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:43 PM

No Interconnection of rivers ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు వంశధార నీరు.. దశాబ్దాల కలగా మిగులుతోంది. దీనిపై గతంలో టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నీరుగార్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు సమీపిస్తున్నా.. వంశధార విస్తరణపై సానుకూల ప్రకటన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

‘వంశధార’ ఎప్పుడు?
ఇచ్ఛాపురంలో బాహుదా నది దుస్థితి

ఆశగా ఇచ్ఛాపురం ప్రజల ఎదురుచూపు

ఏటా ఖరీఫ్‌, రబీలో సాగునీటికి చింత

కలగానే నదుల అనుసంధానం

ఇచ్ఛాపురం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు వంశధార నీరు.. దశాబ్దాల కలగా మిగులుతోంది. దీనిపై గతంలో టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నీరుగార్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు సమీపిస్తున్నా.. వంశధార విస్తరణపై సానుకూల ప్రకటన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2015 మే 6న సీఎం చంద్రబాబు జిల్లావ్యాప్తంగా వంశధార జలాలు అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశాలు జారీచేశారు. 2017 అక్టోబరు 10న వంశధార -బాహుదా నదుల అనుసంధానానికి సంబంధించి డీపీఆర్‌ తయారు చేసేందుకు రూ.5కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 2019 ఫిబ్రవరి 6న ఈ రెండు నదుల అనుసంధానికి సంబంధించి రూ.6,326 కోట్లు మంజూరు చేస్తూ పాలన అనుమతులిచ్చారు. బీఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్‌ సంస్థ టెండర్లు దక్కించుకుంది. పనులు ప్రారంభించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ .. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 25 శాతంలోపు చేపట్టిన పనులను రద్దు చేసింది. ఈ క్రమంలో నదుల అనుసంధానం పనులను సైతం రద్దు చేసి.. టెండర్లు పిలుస్తామని ప్రకటించింది. కానీ, ఆ ఐదేళ్లు వాటి ఊసే ఎత్తలేదు. దీంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు.

1.50 లక్షల ఎకరాల ఎదురుచూపు

వంశధార-బాహుదా నదుల మధ్య నిడివి 110 కిలోమీటర్లు. ఈ రెండు నదులను అనుసంధానం చేసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఇప్పటికే హిరమండలంలోని గొట్టాబ్యారేజీ నుంచి వంశధార ఎడమ కాలువ ద్వారా 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు వరకూ కాలువ విస్తరించి ఉంది. అయితే పలాస నియోజకవర్గంలోని మందస, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాలకు మాత్రం వంశధార జలాలు అందడం లేదు. వంశధార- బాహుదా నదుల అనుసంధానంతో ఈ మండలాలకు సాగునీరు పుష్కలంగా అందే అవకాశం ఉంది. ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం ద్వారా మహేంద్రతనయా, బాహుదా నదులకు వంశధారను అనుసంధానం చేస్తే 1.50 లక్షల ఎకరాలకు సస్యశ్యామలం చేసినట్టే. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సారవంతమైన నేలలు, అన్నిరకాల పంటలు పండే భూములు ఉన్నాయి. వాణిజ్య పంటలకు కూడా నెలవు. అందుకే వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే సుమారు రెండు లక్షల కుటుంబాలకుపైగా ప్రయోజనం చేకూరుతుంది.

అన్నింటా వెనుకబాటే..

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో తలసరి ఆదాయం తక్కువే. ఇక్కడ జనాభాలో 80శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. కానీ సాగుకు సంబంధించి కనీస వసతులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. సాగునీటి వనరులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. మహేంద్రతనయా, బాహుదా నదులు ఉన్నా.. ఎగువన ఒడిశా భూభాగంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో నదుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది. అందుకే ఏటా ఖరీఫ్‌, రబీలో సాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వేలాది రూపాయలు మదుపులు పెట్టిన తరువాత సాగునీరు అందక పంటలు పాడవుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో దాదాపు 40 వేల ఎకరాల్లో పంట వేయకుండా వృథాగా విడిచిపెడుతున్నారు. ఒక్క నదుల అనుసంధానంతోనే సాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ బెందాళం అశోక్‌, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక చొరవచూపాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. నదుల అనుసంధానం దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

భూగర్భ జలాలు పెంచాలి

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో సాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. మహేంద్రతనయా, బాహుదా నదులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వంశధార- మహేంద్రతనయా- బాహుదా నదుల అనుసంధానం జరిగితే ఉద్దానం ప్రాంతానికి మహర్దశ. ప్రజల జీవనోపాధి మెరుగుపడుతుంది. ఉద్దానం కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో కేవలం శుద్ధజలమే కాకుండా భూగర్భ జలాలు పెంచాలి. వంశధార నది నుంచి నీటిని అందించే ఏర్పాట్లు చేయాలి.

- ప్రధాన్‌ శివాజీ, వంశధార సాధన సమితి సమన్వయకర్త

Updated Date - Mar 05 , 2026 | 11:43 PM