Share News

డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడో?

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:13 AM

No notification for degree admissions ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటర్‌ ఫలితాలు విడుదలై రెండు నెలలవుతున్నా.. ఇప్పటివరకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. దీంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు.

డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడో?
నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఇంటర్‌ ఫలితాలొచ్చి రెండు నెలలవుతున్నా కానరాని నోటిఫికేషన్‌

విద్యార్థుల్లో నిరాశ

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటర్‌ ఫలితాలు విడుదలై రెండు నెలలవుతున్నా.. ఇప్పటివరకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. దీంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. గతేడాది ఆగస్టులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇస్తే సెప్టెంబరులో తరగతులు ప్రారంభించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన రెండో సెమిస్టర్‌ పరీక్షలు విద్యాసంవత్సరం పూర్తయినా జరగలేదు. కనీసం ఈ ఏడాదైనా అకడమిక్‌ ఇయర్‌ నుంచి డిగ్రీ ప్రారంభమవుతుందని విద్యార్థులు భావించారు. కానీ నోటీఫికేషన్‌ జారీలో జాప్యమవుతుండడంతో నిట్టూర్చుతున్నారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 105 వరకు ఉన్నాయి. ఇవన్నీ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 15 ఉన్నాయి. ఏటా 13 వేల మందికిపైగా విద్యార్థులు వివిధ డిగ్రీ కోర్సుల్లో చేరతారు.2020-21 నుంచి ఆన్‌లైన్‌ ప్రవేశాల విధానం తీసుకువచ్చారు. గతేడాది వరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించింది. ఈ ఏడాది నుంచి ఉన్నత విద్యా కమిషన్‌రేట్‌కు బాధ్యతలు అప్పగించారు. సాధారణంగా ఇంటర్‌ ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ ప్రవేశాలు ప్రారంభిస్తారు. కానీ ఫలితాలు వచ్చి రెండు నెలలు కావస్తున్నా.. అడ్మిషన్ల పక్రియ ప్రారంభించలేదు. పక్క తెలుగు రాష్ట్రంలో అడ్మిషన్లు ప్రారంభించడంతో జిల్లాకు చెందిన కొందరు విద్యార్థులు అక్కడ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రైవేటు కళాశాలలు హడావుడి

జిల్లాలో పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది.. డిగ్రీ ప్రవేశాల కోసం హడావుడి చేస్తున్నారు. ఇంటర్‌ విద్యార్థుల వివరాలను సేకరించి వారి తల్లిదండ్రులను నేరుగా కలుస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీజులు చెల్లించవల్సిన అవసరం లేదని చెప్పి అడ్మిషన్లు చేపడుతున్నారు.

మూడు ఫేజ్‌లతో ఇబ్బందులు

గత ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాలు ఆన్‌లైన్‌ చేయడంతోపాటు మూడు ఫేజ్‌లలో నిర్వహించడంతో కళాశాలలకు తరగతుల నిర్వహణ తడబాటుగా మారింది. ఆన్‌లైన్‌ చేరికలో మొదటి ఫేజ్‌లో ఇష్టమైన కోర్సు రాకపోతే రెండో ఫేజ్‌లో పెట్టుకోవచ్చు. అదీ రాకపోతే మూడో ఫేజ్‌కి వెళ్లాలి. ఈ విధానం వల్ల విద్యార్థులు కొంత ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థులకు దగ్గరలో ఇష్టమైన కశాశాల ఎంపిక కష్టంగా మారుతోంది. ఆన్‌లైన్‌ ప్రవేశాల అంకం మొదలుకుని సీట్లు కేటాయింపు వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టే వరకు విద్యార్థులకు టెన్షన్‌ తప్పడం లేదు. మరోవైపు ఈ విధానంతో తరగతులు ప్రారంభంలో జాప్యమవుతోంది.

పెరిగిన ఆసక్తి

గత రెండేళ్లుగా డిగ్రీపై విద్యార్థులకు ఆసక్తి పెరిగింది. ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వం వృత్తినైపుణ్యంపై అవగాహన పెంచడంతోపాటు పలు కళాశాలలో క్యాంపస్‌ ఎంపికల్లో టీసీఎస్‌, టెక్‌ మహీంద్ర, డైకాన్‌ తదితర కంపెనీలు మంచి ప్యాకేజ్‌తో జాబ్‌లు ఇస్తున్నాయి. జిల్లాలో ఏటా వందలాది మంది విద్యార్థులు మినిమమ్‌ రూ.3లక్షల ప్యాకేజ్‌కిపైగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. కళాశాలలో సీట్ల భర్తీ పెంచేందుకు యాజమాన్యాలు క్యాంపస్‌ ఉద్యోగాలు అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తున్నారు. దీంతో డిగ్రీ వైప్చు విద్యార్థులు చూస్తున్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:13 AM