ఏం కష్టం వచ్చింది తల్లీ!
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:42 AM
Inter student commits suicide at Kothur KGBV కొత్తూరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని సవర పూజిత(16) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సీతంపేట మండలం దేవానపురం పంచాయతీ లక్కాయిగూడ గ్రామానికి చెందిన పూజిత సీతంపేటలో పదో తరగతి వరకూ చదువుకుంది. ఇటీవల 20 రోజుల కిందట కొత్తూరు కేజీబీవీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీలో చేరింది.
కొత్తూరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
‘నాకు ఇంగ్లీషు అర్థం కావడం లేదు నాన్నా’ అని ఆ గిరిజన బాలిక బాధపడింది. తాను ప్రిన్సిపాల్‌తో మాట్లాడుతానని ఆ తండ్రి ధైర్యం చెప్పాడు. తెలుగు మీడియంలోకి మార్పిస్తానన్నాడు. దుస్తులు కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు. తిరిగి ఆ బాలిక కాలేజీకి వెళ్లింది. ఇంతలో ఏమైందో ఏమో! అర్ధరాత్రి పూట గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఇదీ కొత్తూరు కేజీబీవీలో సవర పూజిత అనే ఇంటర్ విద్యార్థిని విషాదాంతం ఇది.
మెళియాపుట్టి (కొత్తూరు), జూలై 31(ఆంధ్రజ్యోతి): కొత్తూరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని సవర పూజిత(16) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సీతంపేట మండలం దేవానపురం పంచాయతీ లక్కాయిగూడ గ్రామానికి చెందిన పూజిత సీతంపేటలో పదో తరగతి వరకూ చదువుకుంది. ఇటీవల 20 రోజుల కిందట కొత్తూరు కేజీబీవీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీలో చేరింది. ఇటీవల గ్రామానికి వెళ్లి ఇంగ్లీషు అర్థం కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. తొలి నుంచి తెలుగు మీడియం కావడంతో కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుందని.. బాగా చదువకోవాలని వారు నచ్చజెప్పి మళ్లీ కళాశాలకు పంపించారు. గురువారం రాత్రి స్టడీక్లాస్ తర్వాత విద్యార్థినులంతా పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో పూజిత ఖాళీగా ఉన్న పక్కగదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. శుక్రవారం ఉదయం ఈ విషయాన్ని తోటి విద్యార్థినులు గమనించి.. ఉపాధ్యాయులకు చెప్పారు. పోలీసులకు సమాచారం అందడంతో సీఐ చింతాడ ప్రసాద్, ఎస్‌ఐ వెంకటేష్ కేజీబీవీకి చేరుకుని పరిశీలించారు. పుస్తకంలో ఓ లెటర్ లభించినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినులతోపాటు పర్యవేక్షణాధికారి ఏ.గోవిందరావును విచారణ చేస్తున్నారు. కాగా పూజిత ఆత్మహత్య ఘటనతో తోటి విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు.
ఇంగ్లీష్ చదవలేకపోతున్నానని
పూజిత మృతితో తల్లిదండ్రులు బిడ్డికయ్య, తుంపమ్మతోపాటు కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం కేజీబీవీకి చేరుకుని బోరున విలపించారు. ‘ఇంటర్‌లో ఇంగ్లీష్ చదవలేకపోతున్నానని చెప్పింది. ప్రిన్సిపాల్‌తో మాట్లాడి తెలుగు మీడియానికి మార్చమని చెబుతాను అని చెప్పి. దుస్తులు కొనుక్కోవడానికి రూ.900 ఇచ్చాను. బాగా చదువుకోవాలని నచ్చజెప్పి కళాశాలకు పంపించాను. కానీ ఇంతలో ఏమైందో.. మా చిట్టితల్లి మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. అంత కష్టం నీకేమి వచ్చిందమ్మా.. ’ అంటూ తండ్రి సవర బిడ్డికయ్య కన్నీటిపర్యంతమయ్యారు. ఆశలదీపం ఆరిపోయిందని లబోదిబోమన్నారు.