Share News

నేనేం పాపం చేశాను?

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:22 AM

Two-year-old girl at Kanchili railway station కంచిలి రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై శనివారం రెండేళ్ల చిన్నారి ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది. చాలాసేపు వరకు ఎవరూ రాకపోవడంతో అక్కడున్న ప్రయాణికులు పలకరించారు. భయంతో ఉన్న ఆ బాలిక ఏం మాట్లాడలేక పోవడంతో చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు.

నేనేం పాపం చేశాను?
కంచిలి రైల్వేస్టేషన్‌లో చిన్నారి విషితతో చైల్డ్‌లైన్‌ సూపర్‌వైజర్‌ భాగ్యలక్ష్మి

కంచిలి రైల్వేస్టేషన్‌లో రెండేళ్ల బాలిక

అక్కున చేర్చుకున్న చైల్డ్‌లైన్‌ సిబ్బంది

జిల్లా కేంద్రానికి తరలింపు

రెండేళ్ల చిన్నారి. మాటలు సరిగా రావు. అమ్మానాన్న ఒడిలో ఉండాల్సిన వయసు. పక్కన ఎవరూ లేరు. రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాంపై ఒంటరిగా.. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తోంది. ‘నేను చేసిన తప్పేంటి’ అని అడగలేకపోయినా.. ఆ కన్నీళ్లు అదే ప్రశ్నను గట్టిగా అడుగుతున్నట్లు చెబుతున్నాయి. ఆ చిన్నారి కన్నీళ్లు అక్కడున్న ప్రయాణికులను కదిలించాయి.

అలా వదిలేస్తారా?

ఆ పసిప్రాణం ఎటుపోవాలి?

సంసారంలో సవాలక్ష గొడవలు ఉండొచ్చు.

మనస్పర్థలు రావొచ్చు

వాటికి కడుపున పుట్టినబిడ్డ బలి కావాలా?

ఏం పాపం చేసింది ఆ చిన్నారి?

కంచిలి, జూలై 11(ఆంధ్రజ్యోతి): కంచిలి రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై శనివారం రెండేళ్ల చిన్నారి ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది. చాలాసేపు వరకు ఎవరూ రాకపోవడంతో అక్కడున్న ప్రయాణికులు పలకరించారు. భయంతో ఉన్న ఆ బాలిక ఏం మాట్లాడలేక పోవడంతో చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్‌ సూపర్‌వైజర్‌ భాగ్యలక్ష్మి వెంటనే స్టేషన్‌కు వచ్చి ఆ చిన్నారిని అక్కున చేర్చుకుని అమ్మలా ఓదార్చింది. చైల్డ్‌లైన్‌ సిబ్బంది సేకరించిన సమాచారం మేరకు ఆ బాలిక మందస మండలం పిడి మందసకు చెందిన విషితగా గుర్తించారు. బాలిక తండ్రి తారకేశ్వరరావుకు వారు ఫోన్‌ చేశారు. తాను అనారోగ్యంతో ప్రస్తుతం మంచంపై ఉన్నానని, బాలిక సంరక్షణ కొద్దికాలంగా తల్లి చూసుకుంటోందని తెలియజేశారు. తల్లి ప్రస్తుతం ఎక్కడుందో తెలియడంలేదు. ఆమె కోసం ఆరా తీస్తున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవలు, మనస్పర్థల కారణంగానే బాలికను రైల్వేస్టేషన్‌లో విడిచిపెట్టారన్న అనుమానం కలుగుతోందని చెబుతున్నారు. ప్రస్తుతానికి చిన్నారిని జిల్లా బాలిక సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నట్లు వారు తెలిపారు. అయితే అభం, శుభం తెలియని చిన్నారిని కుటుంబ సభ్యులు ఇలా ఒంటరిగా రైల్వేస్టేషన్‌లో విడిచిపెట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారికి ఏఎంసీ మాజీ చైర్మెన్‌ గుమ్మడి రాందాస్‌ రెండువేల రూపాయిల విలువ చేసే దుస్తులు అందజేశారు.

Updated Date - Jul 12 , 2026 | 12:22 AM