ఎన్నికలపై ఏం చేద్దాం?
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:46 PM
శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని 30వ డివిజన్‌కు చెందిన కుశాలపురం గ్రామస్థులు శనివారం సమావేశమయ్యారు.
- కుశాలపురం గ్రామస్థుల సమాలోచనలు
-నగర పాలక సంస్థలో విలీనంపై ఈ నెల 17న సుప్రీం కోర్టులో విచారణ
ఎచ్చెర్లరూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని 30వ డివిజన్‌కు చెందిన కుశాలపురం గ్రామస్థులు శనివారం సమావేశమయ్యారు. నగరపాలక సంస్థలో గ్రామం విలీనంకు సంబంధించి హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈనెల 17న సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. అయితే, 16వ తేదీతో నామినేషన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరించాలని అన్ని పార్టీల నాయకులు తీర్మాణించగా, కొందరు మరో సందేహం వ్యక్తం చేశారు. గ్రామంలో బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు నివాసముంటున్నారని, వీరితో పాటు ఇతర డివిజన్ల వారు నామినేషన్ వేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీంతో వారంతా ఆలోచనలో పడ్డారు. ఒక్కరినే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంచి మాకుమ్మడిగా ఓట్లు వేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు పైడి అన్నంనాయుడు, సాంబమూర్తి, త్రిమూర్తులు, సీహెచ్ కృష్ణారావు, వెంకన్నగారిశ్రీను తదితరులు పాల్గొన్నారు.