Share News

ఇదేం పని!

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:25 PM

ఎక్కడైనా ఆక్రమణకు గురైన సాగునీటి కాలువలు, గెడ్డలు, చెరువులను ఆధునికీకరిస్తే వాటి విస్తీర్ణం మరింత పెరుగుతుంది.

ఇదేం పని!
గెడ్డలోపలకు యంత్రంతో వేసిన మట్టిగట్టు

- తూతూమంత్రంగా కడపల గెడ్డ ఆధునికీకరణ

- ఆక్రమణలు తొలగించకుండా పనులు

- విస్తరణకు బదులు మరింత కూడుకుపోయిన వైనం

- రాజకీయ వత్తిళ్లకు తలొగ్గినట్లు ఆరోపణలు

ఎల్‌.ఎన్‌.పేట, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా ఆక్రమణకు గురైన సాగునీటి కాలువలు, గెడ్డలు, చెరువులను ఆధునికీకరిస్తే వాటి విస్తీర్ణం మరింత పెరుగుతుంది. కానీ, ఎల్‌ఎన్‌పేట మండలంలోని కడపల గెడ్డ విషయంలో ఇది తారుమారైంది. ఈ గెడ్డను ఆధునికీకరించడం వల్ల విస్తరణకు బదులు మరింత కూడుకుపోయింది. రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి గెడ్డలో ఆక్రమణలు తొలగించలేదని, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని తురకపేట-దబ్బపాడు గ్రామాల మధ్య కడపల గెడ్డ ఉంది. రెండు కిలోమీటర్లు పొడవు గల ఈ గెడ్డ ఇరువైపులా ఆక్రమణకు గురై చిన్న బట్టిలా మారింది. దీంతో భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో గెడ్డలో నీటి ఉధృతి పెరిగి పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దీనివల్ల ప్రతీ సంవత్సరం రైతులకు తీరని నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో గెడ్డ ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.7.50 లక్షలు మంజూరు చేసింది. పది రోజుల కిందట పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆక్రమణలు తొలగించి విస్తరణ పనులు చేపడతారని ఆయకట్టు రైతులందరూ ఎంతగానో ఆనందించారు. కానీ, వారి ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. సంబంధిత కాంట్రాక్టరు ఆక్రమణలను తొలగించకుండా కేవలం గెడ్డకు రెండువైపులా గట్టిగా ఉన్న గట్టును మాత్రమే చదును చేశారు. దీంతో గెడ్డ బాగుపడకపోగా అందులో మట్టిపడిపోయి మరింత కుచించుకుపోయింది. దీనివల్ల గతంకంటే అధికంగా నష్టం వాటిల్లుతుందని తురకపేట, దబ్బపాడు, సుమంతాపురం గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంట్రాక్టర్‌, సంబంధిత అధికారులకు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు రావడంతో నిబంధనలు పక్కనపెట్టి తూతూ మంత్రంగా పనులు చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం బిల్లుల కోసమే పనులు చేయించారని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు అంటున్నారు. అసలు పనులు జరగకపోయినా బాగుండేదని నిట్టురుస్తున్నారు.

మానవతా దృక్పథంతో ఆలోచించాం

రైతుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి, నిబంధనల ప్రకారం కడపలగెడ్డ విస్తరణ పనులు చేపట్టాం. ఒకచోట గెడ్డకు ఆనించి నీలగిరి మొక్కలు ఉన్నాయి. రైతు అభ్యర ్థన మేరకు వాటిని తొలగించలేదు. పనులకు సంబంధించి కొలతల ప్రకారం బిల్లు చేస్తాం.

ఎ.రామకృష్ణ, వంశధార డీఈ, ఎల్‌ఎన్‌పేట

Updated Date - Jun 10 , 2026 | 11:25 PM