పర్యాటక ప్రగతేదీ?
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:39 PM
జిల్లా పర్యాటక అందాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో చారిత్రక ప్రదేశాలు, క్షేత్రాలు, సుందరమైన ప్రాంతాలు, బీచ్‌లు ఉన్నాయి.
- జిల్లాలో ఎన్నో సందర్శక ప్రాంతాలు
- అరకొర సౌకర్యాలతో పర్యాటకుల ఇబ్బందులు
- అభివృద్ధికి పడని అడుగులు
- నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
జిల్లా పర్యాటక అందాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో చారిత్రక ప్రదేశాలు, క్షేత్రాలు, సుందరమైన ప్రాంతాలు, బీచ్‌లు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పర్యాటకులూ ఆహ్లాదంగా గడపడానికి అవకాశం ఉంటుంది. కానీ, పర్యాటకశాఖ వీటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదనే విమర్శలు ఉన్నాయి. అరకొర సౌకర్యాల కారణంగా పర్యాటకుల తాకిడి లేక పలు ప్రదేశాలు కళావిహీనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివారం ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా కథనం.
పాతదిబ్బలపాలెం తీరం..
ఎచ్చెర్ల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాతదిబ్బలపాలెం సముద్ర తీరం పాలకుల ఆదరణ కోసం ఎదురుచూస్తోంది. ఈ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే శ్రీకాకుళం నగరవాసులకు, అలాగే ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాల ప్రజలకు మరో అందాల తీరం అందుబాటులో వస్తుందనడంలో సందేహం లేదు. పొన్నాడ వంతెన, బీటీ రోడ్డు నిర్మాణంతో ఈ బీచ్‌కు రవాణా సౌకర్యం సులువైంది. అధికారులు పరిశీలన జరిపినా కార్యచరణ మాత్రం ప్రారంభం కాలేదు. తీరంలో పార్కులు, చిన్నారుల ఆట స్థలాలు, రాత్రి బస కోసం రిసార్ట్‌లు, వసతి గృహాలు, సందర్శకుల రక్షణకు లైఫ్‌గార్డులు, విద్యుద్దీపాల వ్యవస్థను కల్పించాలి. ఈ ప్రాంతాన్ని బీచ్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తే పాతదిబ్బలపాలెం అద్భుత పర్యాటక కేంద్రంగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పొన్నాడ కొండ..
ఒకవైపు నాగావళి నదీ తీరం, మరోవైపు పచ్చని పొలాలతో శ్రీకాకుళం నగరానికి అతి సమీపంలో సహజసిద్ధమైన ఆహ్లాదానికి చిరునామాగా ఉన్న పొన్నాడ కొండ పర్యాటకంగా అభివృద్ధి జరగడం లేదు. నాగావళి నదిపై వంతెన నిర్మాణంతో నగరానికి ఈ కొండ చేరువైంది. దీని పరిధిలో 58.80 ఎకరాల్లో గతంలో వివిధ విభాగాలకు కేటాయించారు. శిల్పారామంకు 9.75 ఎకరాలు కేటాయిస్తే ప్రహరీ కట్టి వదిలేశారు. ఇస్కాన్ మందిరానికి 5 ఎకరాలు అప్పగిస్తే తాత్కాలిక నిర్మాణానికే పరిమితమైంది. పర్యాటక శాఖకు 17 ఎకరాలు, ఎస్టీపీకి 5 ఎకరాలు కేటాయిస్తే అసంపూర్తిగానే నిలిచిపోయాయి. పొన్నాడ కొండను అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రతిపాదన దశలో ఉంది
పాతదిబ్బలపాలెం బీచ్ అభివృద్ధి ప్రతిపాదన దశలో ఉంది. ఈ బీచ్ అభివృద్ధి చెందితే అన్ని విధాలా సౌలభ ్యంగా ఉంటుంది. అదే విధంగా పొన్నాడ కొండపై పర్యాటక శాఖకు కేటాయించిన స్థలంలో అభివృద్ధికి అవసరమైన చర్యలు మొదలవుతాయి.
-ఎన్.నారాయణరావు, జిల్లా పర్యాటకశాఖాధికారి