క్రీడా వికాసమేదీ?
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:58 PM
Sports development centers work stopped క్రీడా వికాస కేంద్రాలకు మోక్షం కరువవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మెరికల్లాంటి క్రీడాకారులను తయారుచేయాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014 - 2019 మధ్య) ఎన్టీఆర్ క్రీడావికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రాల మంజూరు
మధ్యలో పనులు నిలిపివేసిన వైసీపీ సర్కార్
ఉత్సవ విగ్రహాలుగా మిగిలిన వైనం
కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని క్రీడాకారుల విజ్ఞప్తి
ఇచ్ఛాపురం, జూన్ 7(ఆంధ్రజ్యోతి): క్రీడా వికాస కేంద్రాలకు మోక్షం కరువవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మెరికల్లాంటి క్రీడాకారులను తయారుచేయాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014 - 2019 మధ్య) ఎన్టీఆర్ క్రీడావికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని నియోజకవర్గానికి ఒక క్రీడా వికాస కేంద్రానికి శ్రీకారం చుట్టారు. వ్యాయామశాలతో పాటు ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు సంబంధించి మైదానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొన్ని నియోజకవర్గాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో నిర్మాణాలు కొనసాగాయి. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పనులను రద్దు చేసింది. పూర్తయినా కేంద్రాల నిర్వహణను కూడా కనీసం పట్టించుకోకపోవడంతో అవి ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. క్రీడా వికాస కేంద్రాలు పూర్తయిన చోట శిక్షణ ఇచ్చేవారు లేరు. వసతులు కూడా అంతంతమాత్రమే. దీంతో ఇబ్బందులు తప్పడం లేదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి
ఇచ్ఛాపురం ప్రాంతంలో క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారు. వారి కోసం టీడీపీ ప్రభుత్వం స్థానిక రాజావారి మైదానంలో ఎన్టీఆర్ క్రీడావికాస కేంద్రం నిర్మాణ పనులను ప్రారంభించింది. కానీ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పనులను రద్దు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా.. పనుల్లో ఎటువంటి కదలికలేదు. ఒక్క ఇచ్ఛాపురంలోనే కాదు. జిల్లాలో అన్నిచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
పలాస నియోజకవర్గంలో క్రీడాకారులకు కొదువ లేదు. ఉద్దానంలో కబడ్డీ క్రీడాకారులు అధికం. ఇతర క్రీడలపై ఆసక్తి ఉన్నవారు ఉన్నారు. అందుకే పలాసలో అప్పట్లో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించింది టీడీపీ సర్కారు. 25శాతం నిర్మాణాలను కూడా పూర్తిచేసింది. కానీ మిగతా పనులు పూర్తి చేయించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. దీంతో క్రీడాకారులకు శాపంగా మారింది.
టెక్కలి నియోజకవర్గంలో అప్పట్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేయించారు. ముగ్గురు శిక్షకులను కూడా నియమించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దీని నిర్వహణను గాలికొదిలేసింది. ప్రస్తుతం ఒక శిక్షకుడు పే అండ్ ప్లే విధానంలో పనిచేస్తున్నారు. ఒక్క బ్యాడ్మింటన్ కోర్టు మాత్రమే అందుబాటులో ఉంది. వ్యాయామ శాల మూతపడింది. నీటి సదుపాయం లేకపోవడంతో మరుగుదొడ్లు నిరూపయోగంగా మారాయి.
పాతపట్నంలో సైతం ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహణను గాలికొదిలేసింది. కనీసం కేంద్రం చుట్టూ జంగిల్ క్లియరెన్స్ కూడా చేపట్టలేదు. దీంతో అటువైపుగా వెళ్లేందుకు కూడా క్రీడాకారులు సాహసించడం లేదు.
ఆమదాలవలస నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. జగ్గులశాస్త్రులపేటలో ఎన్టీఆర్ క్రీడావికాస కేంద్రం ఏర్పాటైంది. వైసీపీ ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్ మైదానం పేరుతో దానిని ధ్వంసం చేసింది. కానీ అక్కడ ఎటువంటి మైదానం ఏర్పాటు చేయలేదు. దీంతో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నరసన్నపేటలో ఎన్టీఆర్ క్రీడావికాస కేంద్రం కొంతవరకూ అందుబాటులోకి వచ్చింది. కానీ ఇండోర్‌స్టేడియం నిర్మాణం నిలిచిపోయింది. బ్యాడ్మింటన్ ఉడెన్ కోర్టు నిర్మాణం నిధులు లేక నిలిపివేశారు. వైసీపీ ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడంతో దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది.
శ్రీకాకుళం నియోజకవర్గంలో పాత్రునివలస, కళింగపట్నంలో ఎన్టీఆర్ క్రీడావికాస కేంద్రాలను ఏర్పాటుచేయాలని భావించారు. కళింగపట్నంలో 25శాతం పనులతో నిలిపివేశారు. పాత్రునివలసలో గోడల వరకూ నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు.
ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి రణస్థలంలో క్రీడావికాస కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇక్కడ ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని పూర్తిచేశారు. కానీ నిర్వహణను గాలికొదిలేశారు. ఇక్కడ ఒక్క శిక్షకుడు మాత్రమే ఉన్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో పడకేసిన క్రీడావికాస కేంద్రాలను అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వానికి క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో నిధుల మంజూరుతోపాటు సిబ్బంది, శిక్షకులను సైతం నియమించే అవకాశం ఉంది.
- రాజ్‌కుమార్, డీఎస్‌డీవో, శ్రీకాకుళం