ఆర్భాటం తప్ప ఆత్మీయత ఏదీ?
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:17 AM
పెళ్లి..అంటే ఒకప్పుడు రోజుల తంతు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి అంటే అంతా రడీమేడ్ అన్నట్టు మారిపోయింది.
- మారుతున్న వివాహాల ట్రెండ్
- హంగులకే అధిక ప్రాధాన్యం
- అంతా ఈవెంట్ల మయం
- కొన్ని గంటల్లోనే ముగుస్తున్న తంతు
- సంప్రదాయాలను పట్టించుకోవట్లే
- కానరాని ఆ నాటి పెళ్లి సందడి
రణస్థలం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): పెళ్లి..అంటే ఒకప్పుడు రోజుల తంతు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి అంటే అంతా రడీమేడ్ అన్నట్టు మారిపోయింది. ఒక ఈవెంట్‌లా గంటల వ్యవధిలో ముగుస్తుంది. గతంతో పోల్చితే ఖర్చు పెరిగింది. అంతా కృత్రిమ ఆనందమే. కానీ నాటి సందడి లేదు. నాటి కళ లేదు. అంతా ఈవెంట్ ఆర్గనైజింగ్ రూపంలోనే ముగిస్తున్నారు. పెళ్లి కళ తప్పి..అంతా కృత్రిమం అన్నట్టు పరిస్థితి మారింది. మూడు రోజుల పెళ్లి గంటల తంతుగా మారింది. పెళ్లి భాజాల బదులుగా డీజేలు.. చలువ పందిళ్లు బదులు రడీమేడ్ కర్టైన్లు.. డెకరేషన్లు.. ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ ఫంక్షన్లు వీటితోనే ముగిస్తున్నారు. అసలు సిసలైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు.
కానరాని పందిళ్లు
గతంలో భూదేవంతా పెళ్లి పందిరివేసేవారు. తప్పకుండా కొబ్బరి కమ్మలతో కానీ..పచ్చని చెట్టు కొమ్మలతో పందిరి ఏర్పాటు చేసేవారు. అలాచేస్తే వారి జీవితం పచ్చగా ఉంటుందన్నది ఒక నమ్మకం. వాటితో పాటు ఆవు పేడతో అలికిన మండపం సిద్ధం చేసేవారు. అలా చేస్తే చీడపీడలు, ఎటువంటి రుగ్మతలు దరిచేరవని భావించేవారు. కానీ ఇప్పుడు పందిళ్లు కనిపించవు. మండపాలు కానరావు. ఇప్పుడంతా రెడీమేడ్ పందిళ్లు, మండపాలు వచ్చేశాయి. గంటల వ్యవధిలో మండపాలను సిద్ధం చేస్తున్నారు. పచ్చని పందిళ్లు బదులు విద్యుత్ దీప కాంతులతో మంచి స్టేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ పచ్చటి కొమ్మలతో పందిళ్లు ఇచ్చే హాయిని మాత్రం ఇవ్వడం లేదు.
ఫొటోషూట్‌కు ప్రాధాన్యం
ప్రస్తుతం తమ వైవాహిక జీవితానికి సంబంధించి తొలి వేడుకను పది కాలాలపాటు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకుగాను ఫొటో షూట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా వివాహ వేడుకలను స్నేహితులు, బంధువులకు గుర్తుకు తీసుకొచ్చేలా ముందుగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. తొలుత నగరాల్లో ఉన్న ఈ సంస్కృతి పట్టణాలకు, ఇపడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. జిల్లాలో సుదీర సముద్ర తీర ప్రాంతం ఉంది. ఆపై పర్యాటక ప్రాంతాలు సైతం ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలూ ఈ పర్యాటక ప్రాంతాల్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. అచ్చం క్రియేటర్స్ మాదిరిగా ఈ వెడ్డింగ్ షూట్ ఉండేలా అనేక రకాల కెమెరాలు, ఇతర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఆపై ప్రత్యేక యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఆకర్షణీయంగా వీడియోలు, ఫొటోలు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలానా తేదీన, రోజున తమ వివాహం అని స్నేహితులకు గుర్తుకు తెచ్చేలా వీడియోలను రూపొందించి సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారు. స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులు వివాహ తేదీని గుర్తుకు తెచ్చేలా వాట్సాప్ ప్రొఫైల్స్‌గా వీటిని ఉపయోగిస్తున్నారు.
ఏఐతో దివి నుంచి భువికి..
ఇటీవల తరచూ వినిపిస్తున్న మాట ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఈ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత వివాహాలు, శుభకార్యాల్లో ఒక రకమైన ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. చాలా ఇళ్లలో చనిపోయిన ఇంటి పెద్దలు ఉంటారు. వారితో వధూవరులకు విడదీయ రాని బంధం ఉంటుంది. అందుకే వారిని జ్ఞప్తికి తెచ్చేలా వారి ఫొటోలతో కూడిన వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందిస్తున్నారు. వివాహ వేడుకల్లో భారీ స్ర్కీన్లపై ప్రదర్శించి చనిపోయిన వారు వచ్చి ఆశీర్వదించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత వివాహ వేడుకల్లో ఇదో నయా ట్రెండ్ కూడా.
అన్ని పనులు ఒక్కరే...
వివాహ వేడుకలకు సంబంధించి ఈవెంట్ సంస్కృతి కూడా జిల్లాకు ఎక్కువగా పాకింది. సాధారణంగా గతంలో మైక్‌సెట్‌తో పాటు వివాహ పందిరి డెకరేషన్ ఒకరు చూసేవారు. వీడియోగ్రాఫర్, ఫొటో గ్రాఫర్ ఉండేవారు. భోజనాల తయారీకి సంబంధించి సామగ్రి పంపిణీ చేసేవారుండేవారు. ఆపై దక్షిణాది సన్నాయి మేళం, వంటవారు, కేటరింగ్ చేసేవారు వేర్వేరుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈవెంట్ సంస్కృతి జిల్లాలో ప్రవేశించింది. అన్ని పనులు చేసిపెట్టే ఈవెంట్ మేనేజర్లు, సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఫలానా కల్యాణమండపం, ఫలానా ఖాళీ స్థలం అని చూపిస్తే.. అన్నిరకాల సేవలు సదరు ఈవెంట్ సంస్థ చూసుకుంటుంది. ఇందుకుగాను కాంట్రాక్ట్ తీసుకుంటుంది. అంటే పెళ్లి నిర్వాహకులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా అంతా వారే చూసుకుంటారన్న మాట.
ఎంతో లోటు..
పెళ్లి చేసే కుటుంబసభ్యులు, నిర్వాహకులు కొద్ది గంటల ముందే మండపాలకు చేరుకుంటారు. అంటే రోజుల తరబడి జరిగే వివాహ తంతు గంటలకు వచ్చేసిందన్న మాట. అయితే ఆ చలువ పందిళ్లు, సన్నాయి వాయిద్యాలు, రోజుల తరబడి ఉండే బంధువుల సందడి లోటు ఇప్పుడు కనిపిస్తోంది. ముఖ్యంగా ఐదు పదుల వయసు దాటిన వారు నాటి పరిస్థితులను తలచుకొని చాలా ఆనందపడుతుంటారు. అప్పటి వివాహాలు, నాటి ఆప్యాయతలను గుర్తుచేసుకుంటారు. ప్రస్తుతం ‘సౌకర్యం’ తప్ప ఆనందం ఏదని ప్రశ్నిస్తుంటారు. ఏదో పెళ్లిళ్లు అంటే పెళ్లిళ్లు కానీ.. నాటి రోజులకు ఇవి సాటిరావని నడి వయస్కులు చెబుతుంటారు. అయితే వివాహ వ్యవస్థలో మార్పులు పుణ్యమా అని ఉపాధి మార్గాలు పెరుగుతున్నాయి. ఒక పెళ్లి ఖర్చు రూ.10 లక్షలు అయితే.. దాదాపు వంద మంది వరకూ ఉపాధి దొరుకుతోంది. ఇది మాత్రం సంతోషించదగ్గ విషయం. కానీ అంతకు మించి మాత్రం ఎటువంటి సందడి ఉండదు. ఒకవేళ అది ఉన్నా.. కేవలం కొద్ది గంటలు మాత్రమే.
తీరు మారాలి..
వివాహం అనేది ఆలుమగల జీవితంలో తొలి పండుగ. గతంలో పెళ్లి అంటే మూడురోజుల పాటు జరిగేది. కానీ ఇప్పుడు మూడు గంటల్లోనే తతంగం ముగుస్తోంది. ఇంటి ఆడపిల్లలు, మేనత్తలు మూడు రోజుల ముందు వచ్చి వారి ఆచారాలు, సంప్రదాయులు అనుచరించి, పెద్దల సంబంధ బాందవ్యాలు, పేమానురాగాలతో కలిసిమెలిసి వివాహాలు చేసే వారు. నేడు వాటికి భిన్నంగా వివాహాలు జరుగుతున్నాయి. ఈ తీరులో మార్పు రావాలి.
-మేడూరి బాలకృష్ణశర్మ, సార్మత పండితులు, గిరవానిపాలెం
ఊరంతా సందడే..
30 ఏళ్ల కిందట వివాహాలు అంటే ఆ ఇంట్లోనే కాదు.. ఊరంతా సందడి ఉండేది. ఇల్లు బంధు మిత్రులతో కళకళలాడేది. దగ్గర బంధువులు అయితే రోజుల ముందే వచ్చేవారు. కానీ ఇప్పుడు పెళ్లి రోజు వస్తున్నారు. కొద్ది గంటల పాటు ఉండి వెళ్లిపోతున్నారు. పెళ్లిళ్లు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి.. కానీ ఎటువంటి ఆనందం కూడా ఇవ్వడం లేదు.
-కరిమజ్జి భాస్కరరావు, స్థానికుడు, రణస్థలం