Share News

ఆ నిధులు ఏమయ్యాయి?

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:31 AM

Complaint lodged with CMO regarding Paidibhimavaram Panchayat పైడిభీమవరం పంచాయతీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగంపై సోమవారం అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పంచాయతీలో సాధారణ నిధులు రూ.3కోట్లకుపైగా పక్కదారి పట్టించారని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి.

ఆ నిధులు ఏమయ్యాయి?
పైడిభీమవరం పంచాయతీ కార్యాలయం

పైడిభీమవరం పంచాయతీపై సీఎంవోకు ఫిర్యాదులు

డిప్యూటీ ఎంపీడీవో ఆధ్వర్యంలో తనిఖీలు

పనులు, తీర్మానాలు, చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం

రికార్డులను సీజ్‌ చేసిన అధికారులు

రణస్థలం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): పైడిభీమవరం పంచాయతీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగంపై సోమవారం అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పంచాయతీలో సాధారణ నిధులు రూ.3కోట్లకుపైగా పక్కదారి పట్టించారని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. గత ఏడాది ఏప్రిల్‌లో ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వచ్చిన సమయంలో పంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పనులకు రూ.16లక్షలు, 25మంది పారిశుధ్య కార్మికుల యూనిఫాం ఖర్చు రూ.8 లక్షలు చూపించినట్లు, పారిశుధ్య సూపర్‌వైజర్‌ ఖాతా ద్వారా ఏకంగా రూ.69లక్షలు మళ్లించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఏడాదిలో చేపట్టిన పనులకు, చెల్లించిన నిధులకు భారీ వ్యత్యాసం కనిపించింది. దీంతో రికార్డులను సీజ్‌ చేసినట్టు తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌ నాటికి రూ.9.43 కోట్లు పంచాయతీ సాధారణ నిధులు ఉండగా.. ఆ తర్వాత పది నెలల కాలంలోనే రూ.7.5 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు గుర్తించారు. సీసీ రోడ్లతోపాటు పారిశుధ్య నిర్వహణకు రూ.2.52 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించినట్టు తెలుస్తోంది.

ఆదాయం అధికం..

జిల్లాలో అతిపెద్ద పారిశ్రామికవాడ పైడిభీమవరం. ఏపీఐఐసీ జోన్‌ పరిధిలో ఉంది. పెద్ద పెద్ద రసాయన పరిశ్రమలతోపాటు ఇతర పరిశ్రమలు 30 వరకూ ఉన్నాయి. పారిశ్రామిక నిబంధనల ప్రకారం సెస్‌తోపాటు పన్నుల రూపంలో ఏటా ఈ పంచాయతీకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. జిల్లాలోనే ఆదాయపరంగా ముందు వరుసలో ఈ పంచాయతీ ఉంది. అందుకే ఇక్కడ గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శి ఉంటారు. ఈ పంచాయతీకి సంబంధించి ఎప్పుడూ నిధులు పుష్కలంగా ఉంటాయి. అటువంటి పంచాయతీలో నిధుల గోల్‌మాల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాగా రికార్డులను పరిశీలించి సీజ్‌ చేశామని.. విచారణలో గుర్తించిన అంశాలను జిల్లా అధికారులకు నివేదిస్తామని డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Jun 23 , 2026 | 12:31 AM