ఈ నగరానికి ఏమైంది?
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:54 PM
Numerous problems in Srikakulam Corporation శ్రీకాకుళంలో పరిశుభ్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పలు డివిజన్లలో సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్‌లో విలీనమైన ఏడు పంచాయతీల్లో ప్రజలు తమ కనీస అవసరాలపై పంచాయతీ కానీ నగరపాలక సంస్థ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో సమస్యలెన్నో
అధ్వానంగా మారిన చెత్త నిర్వహణ
సక్రమంగా వెలగని వీధిలైట్లు
మురుగులోనే తాగునీటి పైపులు
ఆక్రమణకు గురవుతున్న కాలువలు
పేరుకే జిల్లాకేంద్రం. ఎటు చూసినా చెత్తాచెదారం. కాలువల ఆక్రమణ.. రోడ్లపైనే మురుగునీరు. అమలుకాని ప్లాస్టిక్ నిషేధం. సక్రమంగా వెలగని వీధి దీపాలు. అరకొరగా తాగునీటి సరఫరా..! ఇవీ శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ప్రజలను వెంటాడుతున్న సమస్యలు. మునిసిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా ఆవిర్భవించి ఏళ్లు గడుస్తున్నా.. అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాత శ్రీకాకుళం, జూలై 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో పరిశుభ్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పలు డివిజన్లలో సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్‌లో విలీనమైన ఏడు పంచాయతీల్లో ప్రజలు తమ కనీస అవసరాలపై పంచాయతీ కానీ నగరపాలక సంస్థ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రచార ఆర్భాటాలే తప్ప.. అధికారుల చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు. శ్రీకాకుళంలో రోజుకు సుమారు 80 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం 6 టన్నుల తడిచెత్తను కంపోస్టింగ్ చేసి.. ఆ ఎరువును డివైడర్ మధ్య పెరుగుతున్న మొక్కలకు వాడుతున్నారు. చెత్త నుంచి కార్పొరేషన్‌కు ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. చెత్తను తరలించేందుకు నెలకు రూ.30 లక్షలు ఖర్చు పెడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంటింటా చెత్త సేకరణకు రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వీటితోపాటు పర్యవేక్షణ అధికారుల జీతాలతో కలిపితే నెలకు కోటి రూపాయలకు పైగా ఖర్చవుతోంది. అయినా నగర పరిశుభ్రత మాత్రం రోజురోజుకూ దిగజారుతోంది. సకాలంలో చెత్త బళ్లు రాక.. పలుచోట్ల చెత్తడబ్బాలు లేక ప్రజలు ఎక్కడికక్కడ వీధుల్లో రోడ్లపై ప్లాస్టిక్ కవర్లతో చెత్తను పారబోస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారుతోంది. ఇటీవల కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్.. నగరంలో పారిశుధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసినా.. మార్పు రాకపోకపోవడం గమనార్హం. శ్రీకాకుళంలో ప్లాస్టిక్ నిషేధం ప్రకటనలకే పరిమితమైంది. పెద్దమార్కెట్, రైతుబజార్లలో ప్లాస్టిక్ సంచులు బహిరంగానే వ్యాపారులు వాడుతున్నారు.
వెలగని వీధి దీపాలు
నగరంలో చాలాచోట్ల వీధిదీపాలు పాడై.. వెలగడం లేదు. వెంకటాపురం, చాపురం తదితర పంచాయతీల్లో శివారు కాలనీల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. పాలిటెక్నిక్ కళాశాల పక్క, వెనుక రోడ్లలో వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో మొత్తం 11,500 వీధిదీపాల్లో.. 600కుపైగా పాడైనట్టు నగర పాలక సంస్థలో ఫిర్యాదులు అందాయి. కానీ ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పూర్తిస్థాయిలో అధికారులు లేక.. తాత్కాలికంగా సచివాలయ కార్యదర్శులు ఇన్‌చార్జిలుగా వీటిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎమినిటీ కార్యదర్శి బెనర్జీకి తాత్కాలిక ఏఈ బాధ్యతలు అప్పగించారు. 450 లైట్లు కొని 80 శాతం మరమ్మతులు పూర్తిచేశామని కార్పొరేషన్ డిప్యూటీ ఇంజనీర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
మురుగులోనే తాగునీటి పైపులు
నగరంలో తాగునీటి పైపులు చాలాచోట్ల మురుగుకాల్వల్లో దర్శనమిస్తున్నాయి. లీకుల కారణంగా డయేరియా ప్రబలి అధికారులు యుద్ధప్రాతిపదికన పైపులు మార్చినా.. చాలాచోట్ల పరిస్థితి అలాగే కొనసాగుతోంది. హయాతి నగరం, రాచకట్ల వీధి, నానుబాల వీధి, గారవీధి, మండలవీఽధి తదితర ప్రాంతాల్లో తాగునీటి పైపులు కాల్లల్లో ఉండడంతో ప్రజలను లీకేజీల భయం వెంటాడుతోంది.
విలీన పంచాయతీలకు తాగునీటి ఇబ్బందులు
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనమైన ఏడు పంచాయతీల్లో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలో మంచినీటి కుళాయిలు రెండు పూటలు వస్తుంటే.. తమకు ఒక్కపూటే అరకొరగా నీటి సరఫరా చేస్తున్నారని వాపోతున్నారు. పారిశుధ్య నిర్వహణ కూడా సక్రమంగా చేపట్టడం లేదని వాపోతున్నారు.
కాలువల ఆక్రమణ
నగరంలో ప్రధాన మార్గాల్లో వెడల్పు చేసిన రహదారులు సగానికి సగం కాలువలు ఆక్రమణ వల్ల కుచించుకు పోయాయి. జీటీ రోడ్డు, చిన్నబజార్ రోడ్ల మీద ఇరుప్రక్కల ఉన్న కాలువలను వ్యాపారులు ఆక్రమించడంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి. అయినా ఆక్రమణదారులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కాలువల ఆక్రమణతో రహదారులపై ఎక్కడికక్కడ మురుగునీరు ప్రవహిస్తోంది. దోమల బెడద వెంటాడుతోంది. ఎక్కడా ఫాగింగ్ మెషిన్లు వినియోగించడం లేదు. కార్పొరేషన్ అధికారులు స్పందించి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.