పోలీసులకు ఏమైంది..?
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:00 AM
Even though YCP leaders are going into hiding, there are no arrests ముఖ్యమైన కేసుల విషయంలో జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతల కేసుల విషయంలో మొహమాట పడుతూ.. జాగ్రత్త వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉదంతాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
బడానాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నా అరెస్ట్‌లు లేవు..
సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ పలుమార్లు తిరస్కరించాకనే అదుపులోకి
బెయిల్ లభించే వరకూ తమ్మినేని ఊసే పట్టని వైనం
సెక్షన్లు సైతం ముందే తెలుసుకున్న చింతాడ రవికుమార్
అనుచరులపై కేసులు ఎత్తివేస్తే లొంగిపోతానని వీడియో విడుదల
పోలీసులకే సవాల్ విసురుతున్న వైసీపీ నాయకులు
శ్రీకాకుళం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ముఖ్యమైన కేసుల విషయంలో జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతల కేసుల విషయంలో మొహమాట పడుతూ.. జాగ్రత్త వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉదంతాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
పలాసలో గత నెలలో రోడ్డు ప్రమాదానికి కారుకుడైన తన కుమారుడ్ని కాపాడుకునేందుకు వైసీపీ నేత, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు వేసిన స్కెచ్ చివరినిముషంలో బెడిసికొట్టింది. వీల్లేని పరిస్థితిలో అతని కుమారుడు, అనుచరుడు అరెస్ట్ అయ్యారు. సీదిరి అప్పలరాజు పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నాక.. కొన్ని రోజుల తర్వాత వేచిచూసి పలాసలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపారు. ఈలోగా కేసు కులం.. రాజకీయ రంగు పులుముకుంది. ఇదంతా ప్రభుత్వ తప్పిదమని.. వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.
భూ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అతని సతీమణి వాణిశ్రీ, కుమారుడు చిరంజీవినాగ్‌పై ఇటీవల శ్రీకాకుళం రూరల్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్పీ స్వయంగా వివరాలు వెల్లడించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని.. తమ్మినేని కుటుంబంతో సమా మరొకరిని ఇంకా అదుపులోకి తీసుకోవాల్సి ఉందని.. వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు. వారు అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లి.. బెయిల్ కోసం హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. సీతారాం దంపతులకు షరతులతో బెయిల్ లభించింది కానీ.. చిరంజీవి నాగ్ సోమవారం సాయంత్రం కోర్టులో లొంగిపోయి.. బెయిల్ పొందారు.
తాజాగా గత నెల 30న వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా.. విధుల్లో ఉన్న బూర్జ మహిళా ఎస్‌ఐ ప్రవల్లికపై ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్, అతని అనుచరుల బృందం ప్రవర్తించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. మరుసటి రోజు బాధితురాలి ఫిర్యాదుతో ఆమదాలవలస పోలీసులు చింతాడ రవికుమార్‌తోపాటు అనుచరులు మరో 20 మందిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకుని చింతాడతోపాటు అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. చింతాడ రవికుమార్ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం ఓ ఆడియో విడుదల చేశారు. ‘నేను ఎక్కడకూ పారిపోలేదని.. జిల్లాలోనే ఉన్నాను. మహిళా ఎస్‌ఐని అభ్యంతరకరంగా ఇబ్బంది పెట్టలేదు. ఆమెకు హార్ట్ స్టంట్ పడింది. గ్యాస్ట్రిక్ ఇబ్బందులుండటంతో మేమంతా రక్షణగా ఉన్నాం. అయినా మొత్తం 21 మందిపై కేసు నమోదు చేశారు. నాపై మినహా మిగిలిన ఇరవై మందిపై కేసులు ఎత్తివేస్తే.. గంటలో లొంగిపోతా. అవసరమైతే మరికొన్ని కేసులు పెట్టుకోవాల’ని వీడియో ద్వారా పోలీసులకే సవాల్ విసిరారు. మహిళా ఎస్‌ఐ ఫిర్యాదు నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసును పోలీసులు బయటపెట్టకముందే.. సెక్షన్లతో సైతం ఆయన సామాజిక మాధ్యమాల్లో చదివి వినిపించడం కొసమెరుపు.
అప్పట్లో గోడలు దూకి.. అరెస్ట్ చేసి...
వైసీపీ హయాంలో అప్పటి టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును.. ఇంట్లో ఉన్నప్పుడే పోలీసులు గోడలు దూకి మరీ అరెస్ట్ చేసి రెండుసార్లు ఇబ్బందులు పెట్టారు. ఆయన తప్పించుకునే ప్రయత్నమూ చేయలేదు. అజ్ఞాతంలోకి వెళ్లలేదు. అదేరీతిలో పలాస టీడీపీ నేత గౌతు శిరీష(ప్రస్తుత పలాస ఎమ్మెల్యే)ను సీఐడీ ఆదేశాలతో విజయవాడ తరలించారు. అప్పటి మాజీ విప్ కూన రవికుమార్ ఇంటి చుట్టూ పోలీసులు తెగ తిరుగుతుండేవారు. ఆయనపై కేసులు నమోదు అన్నీఇన్నీ కావు. అప్పట్లో విధులు నిర్వహించిన పోలీసులు ఇప్పుడూ జిల్లాలోనే ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు. అప్పటి ఎస్పీ, డీఎస్పీలు మాత్రం ఇప్పుడు జిల్లాలో లేరు. కానీ ఎస్‌ఐలు, సీఐలు, కానిస్టేబుళ్లు జిల్లాలో పనిచేస్తున్నారు. వైసీపీ నాయకులపై కేసులు నమోదు కాగానే... నేరుగా సెక్షన్లు సైతం తెలిసిపోతున్నాయి వారికి. అజ్ఞాతంగా దర్జాగా వెళ్లిపోయి పోలీసులకు.. ప్రభుత్వానికి సవాల్ విసిరుతున్నారు.
పోలీసుల నుంచే సమాచారం...?
చింతాడ రవికుమార్‌పై అప్పుడే కేసు నమోదు చేయొద్దని ఓ అధికారి ఆదేశించినట్లు సమాచారం. అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళితే.. అప్పుడే అరెస్ట్ ఎందుకు..? అని ప్రశ్నించినట్లు సమాచారం. మధ్యాహ్నం కేసు నమోదు చేయండని ఆదేశాలు వెలువడటంతో మళ్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ పాతది తప్పించి.. కొత్తగా నమోదు చేశారని విశ్వసనీయ సమాచారం. పాత పరిచయాలతో జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కొన్ని పోలీసు స్టేషన్లలోనూ.. మరికొన్ని కీలక విభాగాల్లో కొంతమంది దర్జాగా సమాచారాన్ని అందిస్తూ వైసీపీ నేతలను అప్రమత్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక చేరినట్లు తెలిసింది.
ఓ నేత తనయుడిపై కేసు నమోదు?
గతనెల 30 జగన్ పర్యటన సందర్భంలో వైసీపీ నాయకులు ఉత్సాహం ప్రదర్శించి.. పోలీసులపైనా జులుం చూపించారు. ఓ వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి తనయుడు కూడా అనుచరులను ఉసిగొల్పి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై శ్రీకాకుళం రూరల్ పోలీసుస్టేషన్‌లో అతనిపైన, అనుచరులు ఎనిమిది మందిపై కేసులు నమోదైనట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.
ఎచ్చెర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌పైనా, అతని అనుచరులపైనా ఎచ్చెర్లలోనూ, జేఆర్ పురం స్టేషన్‌లోనూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో ఫలానా సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్న విషయాన్ని పోలీసులు స్పష్టంగా చెప్పలేక పోతున్నారు.