ఆ విజిలెన్స్ విచారణ ఏమైందో?
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:56 PM
: గత టీడీపీ ప్రభుత్వం 2014లో కొండలపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశంతో అంచనాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.
- 33 రోడ్ల పనుల్లో ఎన్నో అవకతవకలు
- వైసీపీ సర్కారు హయాంలో నిర్మాణాలు
- విచారణకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం
- ఏడాదిన్నర దాటుతున్నా అందని నివేదిక
- మెళియాపుట్టి మండలంలోని గిరి శిఖర గ్రామాలైన కేరాశింగి నుంచి గూడ వరకు 2.40 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.3.95 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఇంత వరకు రహదారి పూర్తి కాలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో 2019లో రూ.1.11 కోట్లు, 2023లో రూ.92 లక్షలు కేటాయించారు. అయితే, ఇందులో రూ.1.50కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ, పనులు మాత్రం కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోడ్డు పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అయితే, ఏడాదిన్నర దాటుతున్నా ఇంతవరకు విచారణ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వలేదు. చేసిన పనులకే కాంట్రాక్టర్ పదే పదే బిల్లులు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
=====
- మెళియాపుట్టి మండలంలో కొండపైన ఉన్న చందనగిరి గ్రామ సీసీ రోడ్డు కోసం గత వైసీపీ ప్రభుత్వంలో 2019-23 వరకు రూ.2.31 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత కొరవడిందని, సిమెంట్ తక్కువగా వినియోగించడంతో రోడ్డు ఊడిపోతుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. దీనిపై గిరిజనులు కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అయితే, ఏడాదిన్నర దాటుతున్నా విజిలైన్స్ నివేదిక ఏమైందో తెలియని పరిస్థితి.
మెళియాపుట్టి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వం 2014లో కొండలపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశంతో అంచనాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న కేరాశింగి, చందనగిరి, చిన్ననీలాపురం, గోయిది, రోలుగుడ్డి, దోనుబాయ్, కుసుమూరు, పుట్టగం, చీపి, ఉమాగిరి తదితర గిరిజన గ్రామాల రోడ్లకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌జీఎస్ (జీరామ్‌జీ) పథకం ద్వారా నిధులు కేటాయించింది. అప్పట్లో ఈ రోడ్ల పనులు కొంత మేరకే జరిగాయి. 2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులు మంజూరు చేసింది. అయితే, ఈ పనులను వైసీపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన కొంత మంది నాయకులకు అప్పగించింది. దీంతో వారు పనులు చేయకుండానే ముందస్తుగా బిల్లులు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అధికారులను కూడా వారు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారి ఇతర జిల్లాల నుంచి కొంతమంది కాంట్రాక్టర్లను తీసుకువచ్చి ఈ పనులు చేయించినట్లు తెలుస్తోంది. ఆ కాంట్రాక్టర్లు అప్పటి వైసీపీ నాయకులకు అధికంగా కమీషన్లు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణకు ప్రభుత్వ ఆదేశం..
గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన గిరిజన గ్రామాల రోడ్ల పనుల్లో అవకతవకలు జరిగినట్లు కొంతమంది గిరిజనులు కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ ప్రాంతీయ అధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో సిబ్బంది వివిధ రోడ్ల పనులకు సంబంధించిన కొలతలు, నాణ్యత, రికార్డులను పరిశీలించారు. సాంకేతిక అనుమతులు ప్రకారం పనులు జరిగాయా? లేదా? అని విచారణ చేపట్టారు. అయితే ఏడాదిన్నర దాటుతున్నా ఇంతవరకు ఈ నివేదికను ప్రభుత్వానికి అందించలేదు. వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లలో కొంతమంది ఇప్పుడు పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే విజిలెన్స్ నివేదిక ఆలస్యం జరుగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.
33 రహదారులపై విజిలెన్స్
2019-24లో సీతంపేట ఐటీడీఏ పరిధిలో చేసిన 33 రోడ్ల పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సీతంపేట ఇంజనీరింగ్‌శాఖ పరిధిలో 15 పనులకు గాను రూ.26 కోట్లు, పాతపట్నం సెక్షన్ పరిధిలో 10 పనులకు రూ.12 కోట్లు, మందస పరిధిలో 8 రోడ్ల పనులకు సంబంధించి రూ.14కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరాల్సి ఉంది.
నివేదిక ఇస్తారు..
గతంలో జరిగిన రోడ్ల పనులకు సంబంధించి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ పనులను విజిలెన్స్ సిబ్బంది పరిశీలించారు. ఈ నివేదికను ఇంజనీరింగ్ శాఖకు ఇవ్వరు. నేరుగా ప్రభుత్వానికే ఇస్తారు. ఎవరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోమంటే వారిపై తీసుకుంటాం.
-రాజు, డీఈ, పాతపట్నం సెక్షన్.