ఏమైందో.. ఏమో!
ABN , Publish Date - May 06 , 2026 | 12:15 AM
చినపల్లివూరులో సోమవారం రాత్రి గర్తం ఇందు (25) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
వజ్రపుకొత్తూరు, మే 5(ఆంధ్రజ్యోతి): చినపల్లివూరులో సోమవారం రాత్రి గర్తం ఇందు (25) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇందు మృతికి అత్త వరలక్ష్మి, భర్త శంకరరావులు కారణమని ఆమె తల్లి మోహిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వజ్రపుకొత్తూరు పోలీసులు అందించిన వివరాల మేరకు.. అమలపాడు పంచాయతీ చింతవాని పేటకు చెందిన ఇందుకు చిన్నపల్లివూరుకు చెందిన గర్తం శంకరరావుతో 2017లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల వయస్సు కలిగిన బాబు, పాప (కవలలు) ఉన్నారు. తండ్రి లోకనాఽథం చిన్నప్పుడే మృతిచెందారు. తల్లి మోహిని అన్నీ తానై ఇందును పెంచింది. పెళ్లి సమయంలో కట్నం, లాంఛనాలు ఇచ్చి ఘనంగా వివాహం చేసింది. ఇందు భర్త శంకరరావు ఉపాధి కోసం దుబాయిలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే శంకరావు దుబాయి నుంచి చినపల్లివూరు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యుల మధ్య ఏమి జరిగిందో ఏమోగానీ ఇందు ఉరి పోసుకున్నట్లు ఇందు అత్తవారి నుంచి తల్లికి సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న తల్లి... విగతజీవిగా పడి ఉన్న తన కుమార్తెను చూసి భోరున విలపించింది. ఇందు ఉరి పోసుకొని మృతి చెందినంత పిరికిది కాదని.. భర్త శంకరరావు, అత్త వరలక్ష్మి వేధింపులతో మృతి చెందినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లి పేర్కొంది. మృతి చెందడానికి అరగంట ముందు తన కుమార్తె వీడియో కాల్‌లో మాట్లాడిందని ఆమె తెలిపింది. ఇంతలోనే మృతి చెందడంపై అనుమానాలు ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ వివాహిత మృతి
టెక్కలి, మే 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని బడగాం గ్రామానికి చెందిన వీరఘట్టం అనూష(28) చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. వివరాల్లోకరి వెళితే.. అనారోగ్య కారణాలతో ఆమె సోమవారం రాత్రి ఓ ద్రావణాన్ని తాగింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనూష పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఆమె భర్త కె.గణేష్ విశాఖలో ఉంటున్నారు. అనూష అన్న సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.