Share News

పునరావాస కేంద్రంలో వసతులేవీ?

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:32 AM

Collector expresses anger over officials' negligence అక్వాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో అధికారుల తీరుపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

పునరావాస కేంద్రంలో వసతులేవీ?
పునరావాస కేంద్రం వద్ద అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌

అధికారుల నిరక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

తక్షణమే సౌకర్యాలు కల్పించాలి

అక్వాన్‌ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

ఇచ్ఛాపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : అక్వాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో అధికారుల తీరుపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గురువారం ఇచ్ఛాపురం మండలం డొంకూరులోని పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అక్కడ పరిస్థితులను చూసి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలో తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం, కిటీకీలు సరిగా లేకపోవటంతో సీహెచ్‌డీటీ సంతోష్‌, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. యుద్ధప్రాతిపదికన పునరావాస కేంద్రంలో విద్యుత్‌, తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బోరుకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. గర్భిణులను సమీపంలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీలకు తరలించాలని తెలిపారు. చిన్న గుడిసెల్లో ఉండేవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని తహసీల్దార్‌ ఎన్‌.వెంకటరావుకు సూచించారు.

చేపలవేటకు వెళ్లొద్దు

డొంకూరులో మత్స్యకారులతో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. తుఫాన్‌ నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని తెలిపారు. అలాగే ఇటీవల తుఫాన్‌ కారణంగా డొంకూరులో సగం వరకూ రోడ్డు కొట్టుకుపోయింది. అక్కడ చేపడుతున్న మరమ్మతులను కలెక్టర్‌ పరిశీలించారు.

ఆక్రమణలు తొలగించండి

బాహుదానది ఆక్రమణకు గురువుతుండటంతో.. నదీ ప్రవాహ మార్గం క్రమంగా తగ్గి.. తమ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ నదీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల సమన్వయంతో తొలగించాలని తహసీల్దార్‌ వెంకటరావుకు ఆదేశించారు. వరద నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి వేణుగోపాలరావు, ఇరిగేషన్‌ ఏఈ మధుసూదన్‌ పాణిగ్రాహి, సీఐ మీసాల చిన్నమనాయుడు, దున్న లోకనాథం పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:32 AM