శుద్ధ జలాలేవీ?
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:14 AM
Non-functioning RO plants in schools జిల్లాలో సగానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు మూలకు చేరాయి. వైసీపీ హయాంలో ‘నాడు-నేడు’ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. నాటి వైఫ్యల్యాలు, అవినీతి కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది.
పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సగానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు మూలకు చేరాయి. వైసీపీ హయాంలో ‘నాడు-నేడు’ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. నాటి వైఫ్యల్యాలు, అవినీతి కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది. విద్యార్థులకు తాగునీరు సక్రమంగా అందని దుస్థితి నెలకొంది. జిల్లాలో తొలివిడత ‘నాడు-నేడు’ పథకంలో భాగంగా 1,247 పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఇందుకుగాను రూ.32.69 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా చాలాచోట్ల ఈ ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో తాగునీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చేతిపంపుతోపాటు మునిసిపల్ కుళాయిల నీటిని తాగుతున్నారు. ఈక్రమంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో నాడు-నేడు కింద 35 ఆర్వో ప్లాంట్లు ఏర్పాట్లు చేశారు. ఇందులో 30 ఆర్వో ప్లాంట్లు పాడైపోయాయి. వీటిని పట్టించుకునేవారు లేరు. టెక్నీషియన్‌కు సమాచారం ఇచ్చినా ఎవరూ రావడం లేదని ఇచ్ఛాపురం ఎంఈఓ కె.అప్పారావు తెలిపారు. టెక్నిషియన్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. అన్ని ఆర్వో ప్లాంట్లు వినియోగంలోకి వస్తే.. విద్యార్థులకు తాగునీటికి సమస్య ఉండదని చెబుతున్నారు.
స్పందించని సిబ్బంది
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యబట్టి ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. రూ.50 వేల నుంచి రూ.4లక్షల వరకూ ఖర్చుచేశారు. విద్యార్థులకు ఫ్లోరైడ్ నీటి బాధ నుంచి విముక్తి కల్పించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిర్వహణ మాత్రం చూడలేకపోయింది. దీంతో రకరకాల కారణాలతో ప్లాంట్లు మూలకు చేరాయి. ఆహ్లాద ఇంజనీర్స్ లిమిటెడ్, ఇన్నోవేటివ్ ఇండస్ర్టీస్, లివ్‌ప్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు కంపెనీల నుంచి ఆర్వో ప్లాంట్లను తెప్పించారు. అప్పట్లో సాంకేతిక సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. కానీ ప్రస్తుతం ప్లాంట్లు పనిచేయడం లేదని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు ఫోన్ చేస్తుంటే టెక్నికల్ సిబ్బంది స్పందించడం లేదు. దీంతో హెచ్‌ఎంలు సైతం మౌనం దాల్చాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆర్వో ప్లాంట్లకు మరమ్మతులు చేపట్టాలని, శుద్ధజలాలు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.
దృష్టి సారించాం
ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టిసారించాం. వాటికి మరమ్మతులు చేస్తాం. ఇప్పటికే సంబంధిత కంపెనీ ప్రతినిధులను సంప్రదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
- ఏ రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం